కాన్వా లేఆఫ్స్: షాకింగ్ నిజం! మీకొక హెచ్చరిక.
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సాఫ్ట్వేర్, గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థ కాన్వా (Canva) ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తన 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 22 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన ఈ కంపెనీ సీఈఓ మెలనీ పెర్కిన్స్ తెలిపారు.
ఈ భారీ లేఆఫ్స్‌తో కాన్వా సంస్థ స్వరూపమే పూర్తిగా మారిపోనున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కాన్వాలో సుమారు 5700 మంది పనిచేస్తుండగా, వీరిలో 22 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
దీనిపై ఉద్యోగులకు పంపిన ఓ ప్రకటనలో సీఈఓ మెలనీ పెర్కిన్స్ కీలక విషయాలు వెల్లడించారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణ (restructuring) చర్యల వల్ల 1271 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని తెలిపారు.

ఈ 1271 మందిలో కొందరు ఉద్యోగాలు కోల్పోవచ్చని, మరికొందరి పదవులు లేదా పనిచేసే ప్రదేశాలు మారవచ్చని ఆమె పేర్కొన్నారు. అయితే, కచ్చితంగా ఎంతమందిని తొలగిస్తున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. టెక్ రంగంలోని ఇతర కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలనే కాన్వా కూడా ఎదుర్కొంటోంది.
ఏఐ (AI) వాడకం ద్వారా వేగంగా కొత్త సేవలను తీసుకురాగలుగుతున్నా, దీనికి అయ్యే ఖర్చులు కూడా భారీగా ఉంటున్నాయి. అదే సమయంలో, కొత్త సేవలను ప్రవేశపెడుతున్నా వాటి ద్వారా ఆదాయం రావడానికి ఆలస్యం అవుతోంది.
మరోవైపు, ఏఐ వాడకంతో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పనులు చేయించుకోవడం సాధ్యమవుతోంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను వేగంగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కాన్వా కూడా చేరింది.
"ఈ లేఆఫ్స్ వల్ల ఉద్యోగులకు కలిగే మానసిక వేదన, ఇతర ఇబ్బందులకు నేను చింతిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అని మెలనీ పెర్కిన్స్ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఉద్యోగం కోల్పోయిన వారికి కనీసం 6 నెలల జీతాన్ని పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇది మాత్రమే కాకుండా, ఉద్యోగులు ప్రస్తుతం వాడుతున్న మ్యాక్‌బుక్ లేదా ల్యాప్‌టాప్‌ను వారికే ఇచ్చేస్తారు. దీంతో పాటు ఏడాది పాటు లింక్డ్ఇన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్, కెరీర్ కోచింగ్, ఇతర కంపెనీల ఇంటర్వ్యూలకు సిద్ధమవడానికి సహాయం, రెజ్యూమె తయారీలో సాయం అందిస్తారు. ఉద్యోగుల వద్ద ఉన్న కంపెనీ షేర్లను అమ్ముకోవడానికి కనీసం ఏడాది ఆగాలన్న నిబంధనను కూడా తొలగించారు. వీటన్నింటితో పాటు 12 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కల్పించనున్నారు.


Click it and Unblock the Notifications