Canine Coronavirus: కుక్కల నుంచి మనుషులకు సోకే మహమ్మారి: 8 కేసులు
వాషింగ్టన్: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంది. కోట్లాదిమందిని ఆసుపత్రులపాలు చేసింది. దీన్ని నిర్మూలించడానికి ప్రపంచదేశాలన్నీ తలకిందులవుతున్నాయి. వ్యాక్సిన్లను ప్రయోగిస్తోన్నాయి. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం ఓ యుద్ధమే సాగిస్తోంది. ఇందులోనూ కొత్తకొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తూ.. మరింత ఆందోళనకు గురి చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే మరో కొత్త కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. మలేసియాలో దీన్ని గుర్తించారు పరిశోధకులు.

క్యానిన్ వైరస్..
దీని పేరు క్యానిన్ కరోనా వైరస్ (Canine Coronavirus). కుక్కల నుంచి మనుషులకు అతి త్వరగా సోకే లక్షణాలు ఉన్న వైరస్ ఇది. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. ఈ వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి సైతం వచ్చాయి. క్యానిన్ కరోనా వైరస్ సోకడం వల్ల ఎనిమిది ఆసుపత్రల్లో అడ్మిట్ అయ్యారు. వారిలో ఏడుమంది పిల్లలే ఉన్నారు. వారిలో ఒకరు అయిదున్నర నెలల చిన్నారి. ప్రస్తుతం ఒకరు మినహా మిగిలిన వారందరూ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ ఒకరికి మాత్రం న్యుమోనియా సోకడంతో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా వారికి నయమైంది.

గబ్బిళాల నుంచి వ్యాపించినట్టే.. కుక్కల నుంచి
ఈ క్యానిన్ కరోనా వైరస్‌కు డ్యూక్ యూనివర్శిటీ, ఓహియో స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు సీసీఓవీ-హెచ్‌యుపీఎన్ (CCoV-HuPn)-2018గా పేరు పెట్టారు. గబ్బిళాల నుంచి కరోనా వైరస్ ఎలా మనుషులకు సోకిందని భావిస్తోన్నారో..అదే తరహాలో ఇది కుక్కల నుంచి మైగ్రేట్ అయి ఉంటుందని నిర్ధారించారు. తాము గుర్తించిన క్యానిన్ కరోనా వైరస్‌పై జర్నల్ క్లినికల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌లో ఓ ప్రత్యేక కథనాన్ని రాశారు. కోవిడ్ వైరస్‌ను గుర్తించడానికి వినియోగించిన మాలిక్యులర్ డయాగ్నస్టిక్ టూల్ విధానంలోనే దీన్ని నిర్ధారించినట్లు డ్యూక్ పరిశోధకులు తెలిపారు.

ఇన్‌డెప్త్ రీసెర్చ్..
మలేసియాలో తూర్పు ప్రాంతంలోని సరవాక్‌లో 301 మంది నాశికా రంధ్రాల నుంచి సేకరించిన స్వాబ్‌లను పరిశీలించిన అనంతరం తాము ఈ వైరస్ గురించి నిర్ధారణకు వచ్చినట్లు డ్యూక్ యూనివర్శిటీ ప్రాజెక్ట్ లీడర్ ప్రొఫెసర్ గ్రెగరీ గ్రే తెలిపారు. 2018 నుంచి తాము దీనిపై పరిశోధనలు సాగిస్తున్నామని చెప్పారు. ఈ వైరస్ జీనోమ్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేసిన తరువాత.. అది కుక్కల నుంచి మనుషులకు సోకినట్లు నిర్ధారించామని గ్రెగరీ వివరించారు. దీనిపై తాము మరింత ఇన్‌డెప్త్ పరిశోధనలు సాగిస్తున్నామని, మనుషులకు అదెంత ప్రమాదకారి అనేది తేలాల్సి ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications