MDH Masala: ప్రస్తుత కాలంలో ఇంట్లో అమ్మ-అమ్మమ్మల మాదిరిగా వంటగదిలోనే మసాలాలు తయారు చేసుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. చాలా మంది బయట మార్కెట్లో దొరుకుతున్న వివిధ కంపెనీల ఉత్పత్తులను రుచికోసం తయారీలో వినియోగిస్తున్నారు. అయితే వీటి సురక్షిత గురించి ప్రస్తుతం సమస్యలు ఎదురవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే దేశంలోని రెండు ప్రముఖ సుగంధ ద్రవ్యాల బ్రాండ్లు MDH, ఎవరెస్ట్‌లకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులపై ప్రశ్నలు తలెత్తాయి. వాస్తవానికి హాంకాంగ్, సింగపూర్‌లోని ఆహార నియంత్రణ సంస్థలు MDHకి సంబంధించిన 3 మసాలా ఉత్పత్తులతో పాటు ఎవరెస్ట్‌కు సంబంధించిన ఒకదానిని నిషేధించాయి. ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నాయని అవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయని ఫుడ్ రెగ్యులేటర్లు హెచ్చరించాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఇథిలీన్ ఆక్సైడ్‌ను "గ్రూప్-1 కార్సినోజెన్"గా వర్గీకరించింది. US ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం ఇథిలీన్ ఆక్సైడ్ మానవుల్లో క్యాన్సర్‌ను కలిగిస్తుంది.

హాంకాంగ్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ MDH బ్రాండ్ ఉత్పత్తులైన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా, కర్రీ పౌడర్ మిక్స్ మసాలా పౌడర్ ఉత్పత్తులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో ఎవరెస్ట్ కంపెనీకి చెందిన ఫిష్ కర్రీ మసాలాలో కూడా పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హాంకాంగ్‌లోని మూడు రిటైల్ స్టోర్‌ల నుంచి సేకరించారు. శాంపిల్స్‌లో పురుగుమందు, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు పరీక్ష ఫలితాల్లో తేలింది. రెగ్యులేటర్ విక్రయాలను నిలిపివేయాలని, ఉత్పత్తులను తొలగించాలని విక్రేతలను ఆదేశించింది. ఉత్పత్తులను రీకాల్ చేసినట్లు తెలిపింది.
సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ(SFA) కూడా ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా "నిర్దేశిత పరిమితిని మించి" ఇథిలీన్ ఆక్సైడ్ మొత్తంలో ఉన్నందున రీకాల్ చేయాలని ఆదేశించింది. అయితే తక్కువ స్థాయిలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల తక్షణ ప్రమాదం లేదని SFA తెలిపింది. దీర్ఘకాలం ఎక్స్పోజర్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, వీలైనంత తక్కువగా వాడాలని పేర్కొంది. ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు దానిని తినకూడదని, వినియోగం తర్వాత వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు వైద్యులను సంప్రదించాలని సూచించింది.


Click it and Unblock the Notifications