Banking Multibagger: కరోనా తర్వాత దేశీయంగా డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, చెల్లింపులు ఊపందుకోవటం చాలా మంది ఇన్వెస్టర్లకు లాభాల పంట కురిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ఊహించని రాబడిని అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించిన ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ షేర్ల గురించే. వచ్చే వారం కంపెనీ తన షేర్లను స్ప్లిట్ చేయటంపై నిర్ణయం తీసుకోనుంది. స్టాక్ మార్కెట్‌లకు ఇచ్చిన సమాచారం ప్రకారం 26 ఫిబ్రవరి 2024న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఉంది. షేర్ల పంపిణీని బోర్డు ఆమోదించినట్లయితే.. దాదాపు 7 ఏళ్ల తర్వాత బ్యాంకుకు పెద్ద కార్పొరేట్ ఈవెంట్ అవుతుంది. చివరిగా 20 ఫిబ్రవరి 2017న కెనరా బ్యాంక్ రూ.1,124 కోట్లు విలువైన రైట్స్ ఇష్యూని ప్రకటించింది.

ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు డైరెక్టర్లు, బ్యాంక్ సీనియర్ అధికారులు, బ్యాంక్ సెక్యూరిటీల ట్రేడింగ్ విండో మూసివేయబడుతుందని బ్యాంక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయం గురించి పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి కరోనా తర్వాత కెనరా బ్యాంక్ షేర్లు భారీగా పెరుగుదలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
గడచిన నాలుగేళ్ల కాలంలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ స్టాక్ ధర ఒక్కొక్కటి రేటు రూ.80 స్థాయి నుంచి భారీగా పెరిగి రూ.580కి చేరుకున్నాయి. ఈ కాలంలో పెట్టుబడిదారులు ఏకంగా 625 శాతం లాభపడ్డారు. గత ఏడాది కాలంగా స్టాక్ పనితీరును పరిశీలిస్తే ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్ చేసేసింది. ఈ కాలంలో బ్యాంకు షేర్ల ధర 115 శాతం పెరిగింది. ఇన్వెస్టర్ల దృక్కోణంలో మంచి విషయం ఏమిటంటే.. గత 6 నెలల్లో బ్యాంక్ షేర్ల ధరలు 75 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications