Canara Bank Q2 Results: రెండవ త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ ప్రభుత్వ బ్యాంకులు తమ పనితీరును కనబరుస్తున్నాయి. గతంలో కంటే మెరుగైన లాభాలతో తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని లెండర్ కెనరా బ్యాంక్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను గురువారం విడుదల చేసింది. దీంతో క్యూ2లో బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన ఇది 42.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగి రూ.8,903 కోట్లకు చేరుకుంది.

కెనరా బ్యాంక్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,905 కోట్ల నుంచి 10.30% పెరిగి ప్రస్తుత ఏడాది రూ.7,616 కోట్లకు చేరుకుంది. అలాగే స్థూల ఎన్‌పీఏలు సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో రూ.52,485 కోట్ల నుంచి మెరుగుపడి రూ.43,956 కోట్లకు తగ్గింది. ఇక స్థూల NPA నిష్పత్తి గత ఏడాది ఇదే కాలంలో 6.37% నుంచి తగ్గి 4.76%కి పడిపోయింది. నికర NPA నిష్పత్తి సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో 2.19% నుంచి Q2లో 1.41%కి చేరుకుంది.
బ్యాంక్ రిటైల్ పోర్ట్‌ఫోలియో రూ.1.48 లక్షల కోట్లకు పెరిగి 10.56 శాతానికి పెరిగింది. హౌసింగ్ లోన్ పోర్ట్‌ఫోలియో 12.32 శాతం పెరిగి రూ.88,564 కోట్లకు, వ్యవసాయానికి సంబంధించిన అడ్వాన్స్‌లు 20.54 శాతం వృద్ధితో రూ.2.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బ్యాంకు డిపాజిట్లు 8.22 శాతం వృద్ధి చెంది రూ.11.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే దేశీయ అడ్వాన్సులు 12.59 శాతం వృద్ధితో రూ.8.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో రూ.17,286 కోట్లుగా ఉన్న నికర ఎన్‌పీఏలు తగ్గి ప్రస్తుత ఏడాదిలో రూ.12,554 కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయంలో కెనరా బ్యాంక్ స్టాక్ స్వల్పంగా లాభపడి రూ.359.35 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications