భారత అతిపెద్ద కాఫీ చైన్ కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(CCD) యజమాని వీజీ సిద్ధార్థ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు వీజీ సిద్ధార్థ రాసిన సూసైడ్ నోట్‌లో పలు అంశాలు వెల్లడించారు. దీనికి సంబంధించి కేఫ్ కాఫీ డే అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ఇన్వెస్టిగేషన్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణలో రూ.2,700 కోట్లు అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కేఫ్ కాఫీ డే కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు రూ.2700కోట్ల గురించిన సమాచారం అందించింది. వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబానికి చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్‌కు సీసీడీ నుండి రూ.2,700 కోట్లు తీసుకున్నట్లు గుర్తించామని, వీటిని రికవరీ చేస్తామని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఈ మొత్తాన్ని షేర్ల బైబ్యాక్, తీసుకున్న అప్పులపై వడ్డీలు తీర్చడం కోసం వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటిని రికవరీ చేస్తామని CCD తెలిపింది.

ఈ బృందం దాదాపు ఏడాది పాటు విచారణ జరిపింది. వీజీ సిద్ధార్థ సంస్థల నుండి డబ్బు తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాగే గతంలో వెల్లడించిన 8.4 బిలియన్ డాలర్ల బాకీలు ఉన్నట్లు తెలిపింది.
కేఫ్ కాఫీ డే గ్రూప్ అధినేత వీజీ సిద్దార్థ అనుమానాస్పద మృతి యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఇండియా లో పారిశ్రామికవేత్తలు ఎంతటి ఒత్తిడికి లోనవుతారో చెప్పే ఒక ఉదంతంగా అది మారిపోయింది. వాస్తవిక విషయాలు ఇంకా పూర్తిస్థాయిలో బహిర్గతం కానప్పటికీ... సిద్దార్థ ఆత్మహత్యకు దారితీసిన అంశాలు మాత్రం డబ్బులకు సంబంధినవే కావటం స్పష్టం. ఒక కాఫీ సామ్రాజ్యాన్ని స్థాపించి, దానికి కార్పొరేట్ రూపు రేఖలు అద్ది ఇండియాలో ఒక వ్యవస్థీకృత కాఫీ రిటైలింగ్‌ను పరిచయం చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు సిద్ధార్థ. కానీ అదే సామ్రాజ్యం ఆయన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ ఊబిలో చిక్కుకుని ఎంతకూ బయటకు రాలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని సన్నిహితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications