Coffee Day: దివాలా కేసు ఎదుర్కొంటున్న కాఫీ డే గ్లోబల్.. పూర్తి వివరాలు..
Coffee Day: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కాఫీ రిటైల్ చైన్ కేఫ్ కాఫీడే ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా సిద్ధార్థ కంపెనీ మరో చిక్కుల్లో పడింది.
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ పరిస్థితి 2019 నుంచి దిగజారింది. కేఫ్ కాఫీ డే చైన్ ఆపరేటర్ అయిన కాఫీ డే గ్లోబల్ కార్పొరేట్ దివాలా తీసినట్లు గతవారం అంగీకరించింది. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయడంతో ఇది జరిగినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. జనవరిలో సెబీ నిధుల మళ్లింపుపై రూ.26 కోట్ల భారీ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.

దివాలా కోర్టు బెంగళూరు బెంచ్.. కార్పొరేట్ దివాలా కోసం కంపెనీని అంగీకరించింది. రెండు వారాల క్రితం కంపెనీ తన ఆర్థిక పరిస్థితి గురించి స్టాక్ మార్కెట్లకు నివేదించింది. బ్యాంకులు, ఇతర రుణదాతలకు రూ.220.48 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొంది. ఇందులో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.189.70 కోట్లు చెల్లించడంలో విఫలం కాగా.. ఇదే సమయంలో కంపెనీ ఇప్పటి వరకు రూ.5.78 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయింది.
2019లో దాని వ్యవస్థాపకుడు కంపెనీ వ్యవస్థాపకుడు VG సిద్ధార్థ మరణించినప్పటి నుంచి కంపెనీ ఇబ్బందుల్లో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతోంది. అయినప్పటికీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఇప్పటికీ డిఫాల్ట్ నుంచి కోలుకోలేకపోయింది. తమ ఆస్తుల్లో కొన్నింటిని విక్రయించి రానున్న రోజుల్లో చెల్లింపులు చేస్తామని.. బాకీ ఉన్న రుణాన్ని తగ్గించుకుంటామని కంపెనీ చెబుతోంది. అయితే దివాలాకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications