Hyderabad: తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్! హైదరాబాద్-గోవా.. కొత్త ఫోర్-లేన్ హైవే!
తెలంగాణలోని రోడ్డు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA).. నేషనల్ హైవే-167 (NH-167) ను నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ. 3,175.08 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా హైదరాబాద్- పనాజీ (Hyderabad - Panaji) - ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఉండనుంది.

ప్రాజెక్ట్ హైలైట్స్
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గుడెబల్లూర్ వరకు ఉన్న సుమారు 80.01 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్లు ఇరుగ్గా ఉండటం, జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల గుండా వెళ్లడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుతో ఆ కష్టాలన్నీ తీరనున్నాయి.
- మొత్తం ఖర్చు: రూ. 3,175.08 కోట్లు.
- పొడవు: 80.01 కిలోమీటర్లు.
- బైపాస్ రోడ్లు: ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 36.8 కిలోమీటర్ల మేర బైపాస్‌లు , రిఅలైన్‌మెంట్లను నిర్మిస్తారు.
- ప్రయోజనం పొందే జిల్లాలు: నారాయణ్ పేట్ , మహబూబ్‌నగర్.
ప్రయాణం మరింత సులభం
ప్రస్తుతం గుడెబల్లూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ (Hyderabad) వంటి పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఇది NH-150 , NH-167N వంటి ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానించబడుతుంది. దీనివల్ల వస్తు రవాణా (Logistics) వేగంగా జరగడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఆర్థిక ప్రయోజనాలు.. ఉపాధి..
ఈ భారీ ప్రాజెక్టు కేవలం రోడ్లకే పరిమితం కాలేదు. దీని నిర్మాణ సమయంలో సుమారు 14.4 లక్షల మందికి నేరుగా 17.9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే, పీఎం గతి శక్తి (PM Gati Shakti) కింద ఈ రహదారిని లాజిస్టిక్ నోడ్స్ , ఎకనామిక్ జోన్లతో అనుసంధానించడం వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫార్మా క్లస్టర్లు , మెడికల్ సెజ్ (SEZ) లకు ఇది పెద్ద అసెట్ కానుంది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
2024-25 ఆర్థిక సంవత్సర అంచనాల ప్రకారం.. ఈ మార్గంలో రోజుకు సగటున 17,991 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి భారీ రద్దీని తట్టుకోవాలంటే నాలుగు లేన్ల రహదారి అత్యవసరం. ప్రాజెక్టు వ్యయంలో సివిల్ పనుల కోసం రూ. 1,868.90 కోట్లు.. భూసేకరణ, ఇతర ఖర్చుల కోసం రూ. 459.11 కోట్లు కేటాయించారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక , పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్లడం సులభతరం అవుతుంది.
మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి పోయనుంది.


Click it and Unblock the Notifications