Infosys News: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులుగా నారాయణ మూర్తి దాదాపు అందరికీ సుపరిచితమే. సమాజంలోని వివిధ అంశాలపై యువతకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే దాదాపు ఏడాది క్రితం 70 గంటల పనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ దుమారం రేపుతున్నాయి. పలువురు మూర్తికి మద్ధతుగా మాట్లాడుతుండగా.. మరికొందరు ఆయన ఐడియాలజీ తప్పని వాదిస్తున్నారు.
నిన్న ఓలా CEO భవిష్ అగర్వాల్ మూర్తి ప్రతిపాదించిన 70 గంటల పనికి మద్ధతుగా ఓ పోడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనేకమంది వైద్యులు స్పందించారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరాన్ని నొక్కి చెప్పారు. కాగా ఇప్పడు బసు అనే CA.. నారాయణ మూర్తికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముందు మీరు చేయాల్సింది సక్రమంగా చేయండి తర్వాత ఇతరులకు సలహాలు ఇవ్వచ్చు అన్న రీతిగా ఫైర్ అయ్యారు.

'సెల్ఫ్ సర్టిఫైడ్ క్రిటిక్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ అండ్ జీఎస్టీ' అంటూ చెప్పుకొంటున్న సదరు CA.. ఆదాయపు పన్ను పోర్టల్ గురించి అనేక విషయాలు హైలెట్ చేశారు. పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని పలువురు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. కాగా ముందు దాన్ని సజావుగా నడపమని ఇన్ఫోసిస్ బృందానికి చెప్పండి అని బసు సూచించారు. IT ఫైలింగ్‌లో అంతరాయాలు లేకుండా చూడాలని కోరారు.
'నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు పన్ను నిపుణులమైన మేము వారానికి 70 గంటల కంటే ఎక్కువ సమయం పని చేయడం ప్రారంభించాము. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట ఎక్కువ పని చేయమని చెప్పండి. ముందుగానే ధన్యవాదాలు' అని బసు తన X పోస్టులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సభ్యుడిగా తెలిపారు.


Click it and Unblock the Notifications