Byjus Crisis: దేశంలోనే కాక ప్రపంచంలో అతిపెద్ద ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీగా రికార్డులు సృష్టించిన బైజూస్ ప్రస్తుతం సంక్షోభాల్లో కూరుకుపోయింది. వేగంగా విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు కంపెనీ వద్ద నిధులను ఖాళీ చేశాయి. పైగా పెట్టుబడిదారులతో వివాదాలు కొనసాగుతున్నాయి.
సర్వత్రా వివాదాలు చుట్టుముట్టిన ఎడ్యుటెక్ కంపెనీ బైజూ సంక్షోభం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం బైజూస్‌లోని 20 వేల మందికి పైగా ఉద్యోగులు ఫిబ్రవరి జీతం కోసం ఎదురుచూస్తున్నారు. బైజూ ఉద్యోగులు తమ ఫిబ్రవరి జీతాన్ని మార్చి 10 నాటికి పొందుతారని గతంలో భావించారు.అయితే ఇప్పుడు ఆ డబ్బును పొందేందుకు నిరీక్షణ మరింత కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది. గతంలో చెల్లింపులకు డబ్బు కొరత ఏర్పడగా కంపెనీ సీఈవో తన బెంగళూరు నివాసాలను బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితులు రావటానికిముందు స్టార్టప్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ మాట్లాడుతూ.. కొంతమంది పెట్టుబడిదారులతో న్యాయపరమైన వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో లాక్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. అయితే మార్చి 10లోగా ఉద్యోగుల జీతాలు వస్తాయని రవీంద్రన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వరుస సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడినందున వేతనాలను మార్చి 10న చెల్లించే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. బ్యాంకులకు వరుస సెలవులతో పాటు న్యాయపరమైన చిక్కులు ఉండటం వల్ల బైజూస్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని సన్నిహిత వర్గాల ద్వారా వెల్లడైంది. సవాళ్లను ఎదుర్కోవటానికి కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రవీంద్రన్ గతవారం ఓ లేఖ రాశారు. నెల క్రితం జారీ చేసిన రైట్స్ ఇష్యూ విజయవంతంగా పూర్తయిందని రవీంద్రన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది సంతోషకరమైన పరిణామంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు మా స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి, బాధ్యతలను తిరిగి చెల్లించడానికి మాకు నిధులు ఉన్నాయి. అయినప్పటికీ తాము ఇప్పటికీ మీకు జీతాలు చెల్లించలేకపోతున్నామని తెలియజేయడానికి చింతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. చట్ట ప్రకారం తమకు అనుమతి ఉన్నప్పుడే చెల్లింపులు చేయగలుగుతామని చెప్పారు.


Click it and Unblock the Notifications