BYJU'S: భారీగా ఉద్యోగులను తొలగింపులు.. నిజంగా క్షమించాలంటూ సీఈవో రవీంద్రన్ భావోద్వేగం..
BYJU'S Layoff: ఎడ్టెక్ మేజర్ బైజూస్ ఇటీవలి కాలంలో భారీగా నష్టాలను మూటకట్టుకుంది. కరోనా తర్వాత భారీగా అడ్వర్టైజింగ్ కోసం వెచ్చించటంతో ఈ స్టార్టప్ పరిస్థితి కొంత దిగజారింది. ఖర్చులను తగ్గించుకోవటంలో భాగంగా ఇప్పుడు ఉద్యోగులను భారీగా తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఉద్యోగుల లేఆఫ్..
సమాచారం ప్రకారం BYJU'S దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీనిపై వ్యవస్థాపకుడు, CEO రవీంద్రన్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని, అందుకు తనను 'నిజంగా క్షమించాలని' ఆయన ఈ-మెయిల్ ద్వారా కోరారు. తొలగింపులకు గురవుతున్న ఉద్యోగులు తనలో 5 శాతమని ఆయన వ్యాఖ్యానించారు.

కంపెనీ కోసం..
లాభాలు ఆర్జించాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈమెయిల్ లో వెల్లడించారు. కంపెనీని సుస్థిరమైన వృద్ధి బాటలో నడిపించేందుకు తీసుకున్న నిర్ణయంగా చెప్పారు. తాను దీనిని లేఆఫ్ కింద చూడటం లేదని.. కంపెనీని స్థిరమైన వృద్ధి బాటలో ఉంచడం ద్వారా తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకురావడం ఇప్పుడు తనకున్న ప్రథమ ప్రాధాన్యతని భావోద్వేగ వీడ్కోలు నోట్‌లో ఉద్యోగులకు తెలిపారు. ఉద్యోగులు తన జీవితంలో భాగమని అందులో వ్యాఖ్యానించారు.

గతంలోనూ ఉద్యోగుల తొలగింపు..
ఖర్చులను తగ్గించుకోవడానికి, రిడెండెన్సీలను నివారించడానికి దాదాపు 2,500 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు బైజూస్ గత నెలలో ప్రకటించింది. దేశంలోని ఎడ్ టెక్ కంపెనీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. మరికొన్ని ఏకంగా వ్యాపారాలను క్లోజ్ చేస్తున్నాయి. ఇంతకు ముందు జూన్ మాసంలో బైజూస్ కంపెనీ 1100 మంది ఉద్యోగులను తొలగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,588 కోట్ల నష్టాన్ని చవిచూడటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.

నాలుగేళ్లు దూకుడు..
దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైజూస్ గత నాలుగు సంవత్సరాలుగా విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు "స్థిరంగా అభివృద్ధి చెందడం" లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి 2018-2021 హైపర్ గ్రోత్ సంవత్సరాలని కంపెనీ వెల్లడించింది. కానీ 2022 కంపెనీ వ్యాపారంలో అనుకోని మార్పును తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించిన కంపెనీ ప్రస్తుతం లాభదాయకతకు ప్రాధాన్యత ఇస్తోంది.


Click it and Unblock the Notifications