Gold: బంగారంలో లాభాలు రావాలంటే నగలు కొనడం మానేయండి! ఇన్వెస్టర్లకు నిపుణుల కొత్త సలహా..
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక భరోసా. కష్టకాలంలో ఆదుకుంటుందని చాలామంది నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే బంగారం (Gold) కొనేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద నష్టాలకు దారితీస్తాయి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో బంగారాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. మార్కెట్ టైమింగ్ కోసం చూడకండి
చాలామంది బంగారం ధర బాగా తగ్గినప్పుడు ఒకేసారి కొందామని ఎదురుచూస్తుంటారు. కానీ మార్కెట్ ఒడిదుడుకులను ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నిపుణులు ఏం చెబుతారంటే.. ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా, కొంచెం కొంచెంగా (Phased buying) కొనడం ఉత్తమం. దీనివల్ల ధరల్లో వచ్చే మార్పుల నుండి మీరు తప్పించుకోవచ్చు.
2. హాల్‌మార్క్ , ప్యూరిటీ చెక్
నగలు అందంగా ఉన్నాయని మురిసిపోయి, క్వాలిటీని మర్చిపోకూడదు. హాల్‌మార్క్ లేని బంగారం కొనడం అంటే మీ చేతులతో మీరే నష్టాన్ని కొనితెచ్చుకోవడమే. బంగారం కొనేటప్పుడు ఎల్లప్పుడూ ఇవి గమనించండి..
- BIS హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉందో లేదో చూడాలి.
- నగలు 22 క్యారెట్లు లేదా 24 క్యారెట్లు ఉన్నాయా అనేది బిల్లులో చెక్ చేయాలి.
- సరైన బిల్లింగ్ , డాక్యుమెంటేషన్ తప్పనిసరి.
3. ధరలను పోల్చి చూడకపోవడం
ఒక్కో జ్యువెలరీ షాపులో మేకింగ్ ఛార్జీలు, ఇతర ట్యాక్స్‌లు వేర్వేరుగా ఉంటాయి. మీరు కొనే ముందు కనీసం మూడు నాలుగు షాపుల్లో ఆ రోజు రేటు , అదనపు ఛార్జీలను పోల్చి చూడాలి. చిన్నపాటి రీసెర్చ్ చేయడం ద్వారా మీరు వేల రూపాయలను ఆదా చేయవచ్చు.
4. మేకింగ్ ఛార్జీల మాయాజాలం
నగలు కొనేటప్పుడు వాటి తయారీ ఖర్చు (Making Charges) చాలా కీలకం. కొన్నిసార్లు ఈ ఛార్జీలు బంగారం ధరలో 10% నుండి 20% వరకు ఉంటాయి. మీరు ఆ నగలను తిరిగి అమ్మేటప్పుడు ఈ మేకింగ్ ఛార్జీలు మీకు తిరిగి రావు. అందుకే వీలైనంత వరకు తక్కువ మేకింగ్ ఛార్జీలు ఉన్న డిజైన్లను ఎంచుకోవడం తెలివైన పని.
5. కేవలం నగలపైనే పెట్టుబడి పెట్టకండి
కేవలం ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రమే బంగారం కొనాలనుకుంటే, నగలు సరైన ఎంపిక కాదు. ఎందుకంటే వాటి తయారీ ఖర్చులు పోతాయి. దానికి బదులుగా ఇవి ప్రయత్నించండి..
- డిజిటల్ గోల్డ్ (Digital Gold)
- గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs)
- సావరిన్ గోల్డ్ బాండ్లు (Sovereign Gold Bonds) ఈ ఆప్షన్లలో మేకింగ్ ఛార్జీలు ఉండవు , వీటిని మేనేజ్ చేయడం కూడా చాలా సులభం.
స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి
బంగారం (Gold) అనేది దీర్ఘకాలిక ఆస్తి. తొందరపడి ఒకేసారి లక్షలు పెట్టకుండా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లాగా నెలకు కొంచెం చొప్పున పెట్టుబడి పెట్టండి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీ బంగారం కొనుగోలు లాభదాయకంగా ఉంటుంది. గుర్తుంచుకోండి.. తెలివైన నిర్ణయమే మీ పెట్టుబడికి అసలైన రక్షణ!


Click it and Unblock the Notifications