బంగారం కొనే కొత్త పద్ధతి: NSE ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGRs) ఎలా కొనాలో తెలుసా?
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు కాలం మారుతోంది. చేత్తో పట్టుకునే బంగారం (Physical Gold) కంటే, డిజిటల్ రూపంలో దాచుకునే బంగారంపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (EGRs) అనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది పక్కాగా సెబీ (SEBI) నిబంధనలకు లోబడి, ఫిజికల్ గోల్డ్ బ్యాకప్‌తో పనిచేస్తుంది.

అసలు ఈ EGR అంటే ఏంటి?
సాధారణంగా మనం షేర్లు కొన్నప్పుడు అవి మన డీమ్యాట్ ఖాతాలో ఎలా కనిపిస్తాయో, ఈ EGR లు కూడా అలాగే డిజిటల్ రూపంలో ఉంటాయి. మీరు ఒక EGR కొన్నారంటే, దానికి సమానమైన ఫిజికల్ గోల్డ్ (Gold) సెబీ గుర్తింపు పొందిన వాల్ట్‌లలో (Vaults) సురక్షితంగా భద్రపరచబడి ఉంటుంది. అవసరమైతే మీరు ఈ డిజిటల్ రిసిప్ట్స్‌ను తిరిగి అసలు బంగారంగా మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.
స్టెప్-బై-స్టెప్: EGR లు ఎలా కొనాలి?
- డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతా: EGR లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ట్రేడ్ అవుతాయి కాబట్టి, మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ ఖాతా ఉండాలి. సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ వద్ద పాన్ కార్డ్, [Aadhaar Redacted] కార్డు వంటి డాక్యుమెంట్లు ఇచ్చి కేవైసీ (KYC) పూర్తి చేయాలి. ఖాతా యాక్టివేట్ అయిన తర్వాతే మీరు ట్రేడింగ్ చేయగలరు.
- మీ బ్రోకర్ సేవలు ఇస్తున్నారా? EGR లు అనేది ఒక కొత్త సెగ్మెంట్. కాబట్టి అన్ని బ్రోకింగ్ యాప్స్‌లో ఇది ఇంకా అందుబాటులోకి రాకపోవచ్చు. మీ ట్రేడింగ్ యాప్‌లో లాగిన్ అయ్యి 'EGR' అని సెర్చ్ చేయండి. అక్కడ ఎన్ఎస్ఈ లిస్టెడ్ సింబల్స్ కనిపిస్తే, మీ బ్రోకర్ ఈ సేవలు అందిస్తున్నారని అర్థం.
- క్వాంటిటీని ఎంచుకోండి: EGR లలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. మీరు తక్కువ మొత్తంలో కూడా బంగారం కొనొచ్చు. 1 కిలో, 100 గ్రాములు, 10 గ్రాములే కాకుండా.. కేవలం 1 గ్రాము లేదా 100 మిల్లీగ్రాముల పరిమాణంలో కూడా బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు.
- ఆర్డర్ ప్లేస్ చేయండి: మార్కెట్ సమయాల్లో బంగారం ధరను గమనిస్తూ, మీకు నచ్చిన ధర వద్ద 'Buy Order' పెట్టాలి. ఇది స్టాక్ కొన్నట్లే చాలా సులభం.
- డీమ్యాట్ ఖాతాలోకి జమ: ప్రస్తుతం EGR లు T+1 సెటిల్‌మెంట్ పద్ధతిని పాటిస్తాయి. అంటే మీరు ఈరోజు బంగారం కొంటే, మరుసటి పనిదినం నాటికి అవి మీ డీమ్యాట్ ఖాతాలోకి వచ్చేస్తాయి. అక్కడి నుండి మీరు వీటిని ఎప్పుడైనా ట్రాక్ చేయవచ్చు లేదా అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు.
ఇన్వెస్టర్లకు కలిగే లాభాలేంటి?
EGR ల ద్వారా బంగారం కొనడం వల్ల పారదర్శకత (Transparency) ఉంటుంది. ధరల విషయంలో మోసపోయే అవకాశం ఉండదు. పైగా మీరు ఫిజికల్ గోల్డ్ లాగా లాకర్లలో దాచుకోవాల్సిన అవసరం లేదు, దొంగతనాల భయం ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫోన్ ద్వారానే మార్కెట్ ధరను బట్టి అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చు.
భారతదేశంలో బంగారం (Gold) ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో EGR లు ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. ఫిజికల్ గోల్డ్ మెయింటెనెన్స్ కష్టమని భావించే వారికి, తక్కువ బడ్జెట్‌లో బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం. పారదర్శకమైన ధరలు, ప్రభుత్వ నియంత్రణ ఉండటం వల్ల ఇన్వెస్టర్లు నిర్భయంగా ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారాన్ని ఇలా డిజిటల్ రూపంలో ఉంచుకోవడం ఆర్థికంగా కూడా మీకు లాభిస్తుంది.


Click it and Unblock the Notifications