Layoffs: ఉద్యోగులను తొలగించిన ఫిన్‌టెక్ స్టార్టప్.. అసలు కారణం ఏంటంటే..??
Zest Money: దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా రుణాలపై ఆధారపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత ప్రజల్లో కన్జూమరిజం పెరిగిన వేళ షాపింగ్ విరివిగా చేస్తున్నారు.
ఈ క్రమంలో అనేక బై నౌ పే లేటర్ ఫిన్ టెక్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టాయి. ప్రజలకు తక్కువ ఖర్చులో రుణ సౌకర్యాన్ని ఇవి షాపింగ్ కోసం అందించేవి. అలా ఏడాళ్ల కిందట రంగంలో ప్రారంభమైన కంపెనీనే జెస్ట్‌మనీ. భారతదేశంలో ఈ వ్యాపార మోడల్ పై నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులు కంపెనీ వ్యాపారాన్ని కొనసాగలేని స్థితికి తీసుకొచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారాన్ని పునరుద్ధరించడంలో విఫలమైన తరుణంలో కంపెనీ మూసివేయాలని నిర్ణయించబడింది.

ఇందులో భాగంగానే ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగించాలని Zest Money నిర్ణయించింది. ఇదే విషయాన్ని యాజమాన్యం తన ఉద్యోగులకు సైతం తెలియజేసింది. అయితే వ్యాపార మూసివేతకు అవసరమైన ఫైనాన్స్ అండ్ లీగల్ టీమ్స్ మినహా మిగిలిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది నవంబరులో యూపీఐ దిగ్గజం ఫోన్ పే కంపెనీని కొనాలనుకున్నప్పటికీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాలతో ప్లాన్‌ను రద్దు చేసుకుంది.
వాస్తవానికి కంపెనీని 2016లో లిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ స్థాపించారు. 17 మిలియన్ల కస్టమర్ బేస్‌ను ఇది కలిగి ఉంది. అలాగే నెలకు రూ.400 కోట్ల రుణాలను పంపిణీని కలిగి ఉంది. దేశంలో 10,000 ఆన్‌లైన్ బ్రాండ్‌లు, 75,000 ఆఫ్‌లైన్ స్టోర్‌లతో 27 రుణ భాగస్వాములు మరియు వ్యాపార భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది. ఈ క్రమంలో చట్టాల్లో వచ్చిన మార్పులతో వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు రావటంతో కొన్ని నెలల కిందట ఫౌండర్లు కంపెనీని వీడి బాధ్యతలను ఇన్వెస్టర్లు, కొత్త యాజమాన్యం చేతిలో పెట్టారు. కంపెనీని నడిపేందుకు ZestMoney 2.0 ప్లాన్ తో వచ్చినప్పటికీ అది ఫలించలేదని వెల్లడైంది.


Click it and Unblock the Notifications