Adani: ప్రముఖ వ్యాపారి గౌతమ్ అదానీ ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్‌ను కలిశారు. వీరిద్దరూ ముంబైలోని పవార్‌కు చెందిన సిల్వర్ ఓక్ రెసిడెన్సీలో కలిశారు. అయితే ఈ క్రమంలో వారిద్దరి మధ్య దాదాపు చర్చలు రెండు గంటల పాటు కొనసాగాయి. అసలు ఇందులో ఏం చర్చించారనే దానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని అంటూనే.. సుప్రీం కోర్టుతో కమిటీ ఉంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలవటం అటు రాజకీయంగాను, ఇటు వ్యాపార వర్గాల్లోనూ ఆసక్తి కొనసాగుతోంది. ఇద్దరి మధ్య సమావేశం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శరత్ పవార్ గతంలో ప్రతిపక్షాలు టాటా-బిర్లాలను టార్గెట్ చేసేవని.. ప్రస్తుతం అంబానీ-అదానీలపై ప్రస్తుతం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. అయితే దేశాభివృద్ధిలో టాటా, బిర్లాలు ఎంతగా తోడ్పడ్డారనే విషయం ప్రస్తుతం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అదానీ-అంబానీ గ్రూప్ పేర్లను వాడుతున్నారని తెలిపారు.
అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పెట్రో కెమికల్స్, ఇతర రంగాల్లో గణనీయమైన కృషి చేయగా.. అదానీ గ్రూప్ పవర్, ఇతర రంగాల్లో చాలా కృషి చేసిందన్నారు. అయితే వీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సరైన సాక్ష్యాలతో రుజువు చేసేందుకు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండగా.. ఎలాంటి ఆధారాలు చూపకుండా నిందించటం సరికాదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే అదానీకి వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్టును కాంగ్రెస్ పట్టుకుందన్నారు.


Click it and Unblock the Notifications