భరించలేరేమో.. మీ ఇళ్లను డిస్కౌంట్‌కైనా అమ్మేయండి: హోమ్ బయ్యర్స్‌కు గుడ్‌న్యూస్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగానే ఉంది. రియల్ ఎస్టేట్ కూడా బేజారయింది. ఇళ్ల అమ్మకాలు మార్చి నెలలోనే కొన్ని ప్రాంతాల్లో సగానికి పైగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల కొనుగోలుదారులు లేక రియాల్టర్లు, హౌస్ ఇన్వెస్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రూ.66,000 కోట్ల విలువైన నిర్మాణం పూర్తైన ఇళ్లు
అదే సమయంలో చేతిలో డబ్బు ఉండి, ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి, హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి మాత్రం ఇది ఎంతో ప్రయోజనకరం. లాక్ డౌన్ కారణంగా రియల్ ఎస్టేట్ తీవ్రంగా నష్టపోతున్నారు. రెడీ టూ హోమ్ ఇళ్లు కూడా కొనే వారు కరువయ్యారు. ప్రస్తుతం దాదాపు రూ.66,000 కోట్ల విలువైన నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయని ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అనరాక్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో రియాల్టర్లు, ఇళ్లపై ఇన్వెస్ట్ చేసే వారికి సూచన కూడా చేస్తోంది.

డిస్కౌంట్ రేట్లకైనా వదిలించుకోండి
పూర్తయిన ఇళ్లు అవకాశం వస్తే డిస్కౌంట్ రేట్లకు అయినా వదిలించుకోవాలని అనరాక్.. రియల్ సంస్థలకు సలహా ఇస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, పుణే, బెంగళూరు వంటి నగరాల్లో మార్చి చివరి నాటికి రెడీ టూ హోమ్ ఇళ్లు 78,000 వరకు ఉన్నాయని, వీటి వ్యాల్యూ రూ.65,950గా తెలిపింది.

చిన్న వారికి ఇబ్బందికరం.. డిస్కౌంట్, ఇన్సెంటివ్స్‌పై అమ్మేయండి
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలు ఇళ్లు అమ్ముడు కాకపోయినా కొద్ది నెలల పాటు ఉండగలవని, కానీ చిన్న కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడిన వారికి ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమే అంటున్నారు. చిన్న కంపెనీలు ఇప్పుడే వీటిని డిస్కౌంట్లు, ఇన్సెంటివ్స్ పైన విక్రయించడం బెట్టర్ అని సూచిస్తున్నారు.

కరోనా.. ప్రభావం ఎంత కాలం ఉంటుందో?
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా.. అలాగే దాని ప్రభావం ఎంత కాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని వివిధ రంగాలకు చెందిన నిపుణులు గుర్తు చేస్తున్నారు. తొలుత మార్చి 24 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు, ఆ తర్వాత మే 3వ తేదీ వరకు పొడిగించారు. దేశంలో కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో మే 3వ తేదీ తర్వాత కూడా మరికొంత కాలం ఉండవచ్చునని చెబుతున్నారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం మూడు నెలల నుండి ఆరు నెలల సమయమైనా పడుతుందని చెబుతున్నారు. కాబట్టి అప్పటి వరకు చిన్న రియల్ సంస్థలు భారం మోయలేవని, ఇన్సెంటివ్స్, డిస్కౌంట్స్ పైన విక్రయించడమే బెట్టర్ అంటున్నారు.

10 శాతానికి పైగా..
కాగా, కరోనా అనంతరం ఇటీవలి కాలంలో ఇళ్ల అమ్మకాలు, ధరలు కూడా పడిపోయాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్ వరకు అమ్మకాలు పర్వాలేదని, అలాగే వివిధ నగరాల్లో ధరలు కూడా పెరిగాయని రియల్ సంస్థలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో అన్నింటి కంటే ఎక్కువగా హైదరాబాద్‌లో ధరలు 9 శాతం పెరిగాయి. మిగతా నగరాల్లో ఆరు శాతం నుండి 1 శాతం వరకు పెరిగాయి. అంటే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్లు అమ్ముడుపోక ధరలు కూడా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల కొద్ది నెలల పాటు రియల్ ఎస్టేట్ ధరలు 10 శాతం అంతకు మించి పడిపోవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications