Layoffs News: విమానయానాన్ని తాకిన లేఆఫ్స్ సెగ.. వందలాది మందికి ఆ సంస్థ నోటీసులు
Spicejet layoffs: కరోనా నుంచి ప్రపంచం తిరిగి కోలుకుంటున్న తరుణంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఆయా ఎయిర్‌లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేశాయి. అందుకు తగిన స్థాయిలో సిబ్బందిని సైతం పెంచుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారిపోయింది.
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏటా 100 కోట్ల మేర ఆదా చేసేందుకు ప్లాన్ చేసింది. తన సిబ్బందిలో 1,400 మందిని తొలగించడానికి సిద్ధమైంది. అంటే దాని వర్క్‌ఫోర్స్‌లో సుమారు 15 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

'మా టర్న్‌అరౌండ్ మరియు ఖర్చు తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇటీవలి ఫండ్ ఇన్‌ఫ్యూజన్‌ను అనుసరించి లాభదాయకమైన వృద్ధిని సాధించడం మా ప్రస్తుత లక్ష్యం. భారతీయ విమానయాన పరిశ్రమలోని అవకాశాలను ఉపయోగించుకుంటూ, నిలబడేందుకు మానవ వనరులను హేతుబద్ధీకరించడం ప్రారంభించాం. ఈ చొరవ ద్వారా వార్షిక ప్రాతిపదికన 100 కోట్ల వరకు ఆదా చేయవచ్చని అంచనా వేస్తున్నాము' అని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు.
ఈ నిర్ణయంతో పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవడం సహా కార్యకలాపాలకు తగిన విధంగా ఖర్చులను సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం స్పైస్‌జెట్ దాదాపు 9 వేల మంది ఉద్యోగులను కలిగి 30 విమానాల సముదాయంతో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. 60 కోట్లను కేవలం సిబ్బంది వేతనాలకే ఖర్చు చేస్తున్నట్లు మీడియా నివేదిక పేర్కొంది. దీంతో ఆ మొత్తాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే తొలగింపు నోటీసులు ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications