Budget 2026 Wishlist: భారత పన్ను వ్యవస్థా విధానం గత కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుదారులకు తగ్గింపులు, మినహాయింపుల ద్వారా కొంతమేరకు ఉపశమనాన్ని అందిస్తోంది. అయితే, ఈ ప్రయోజనాలు ప్రధానంగా పాత పన్ను విధానం ఎంచుకునే వారికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టిన తర్వాత.. ఆదాయపు పన్ను చట్టం-1961 కింద ఉన్న అనేక కీలక తగ్గింపులు వాటి ప్రాధాన్యతను కోల్పోయాయని చెప్పవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కొత్త పన్ను విధానంలో తగ్గింపులు లేకపోయినా, పన్ను స్లాబ్‌లు, రేట్లు సవరించడం ద్వారా నికర పన్ను భారం తగ్గించే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ, ప్రతి పన్ను చెల్లింపుదారుడు తన ఆదాయం, పెట్టుబడులు, ఖర్చులను బట్టి ఏ విధానం అనుకూలమో ముందుగా లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో, ఇప్పటికే పెట్టుబడులు ఉన్నవారు లేదా పెద్ద తగ్గింపులకు అర్హత కలిగిన వారు ఇప్పటికీ పాత విధానాన్నే ఇష్టపడుతున్నారు.

అసలు సమస్య ఏమిటంటే.. పన్ను మినహాయింపుల పరిమితులు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరగకపోవడం. జీవన వ్యయాలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగినా, తగ్గింపుల పరిమితులు ఏళ్ల తరబడి మారకుండా అలాగే ఉన్నాయి. ఇది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన భారం మోపుతోంది.
సెక్షన్ 80C కింద ప్రస్తుతం గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మాత్రమే తగ్గింపు ఉంది. ఈ పరిమితి 2014 నుంచి మారలేదు. PPF, ELSS, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహ రుణ ప్రిన్సిపల్, బీమా ప్రీమియం వంటి అనేక ఖర్చులు ఇందులోనే వస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఈ పరిమితిని రూ. 3 లక్షలకు పెంచడం ద్వారా పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించవచ్చు.
ఆరోగ్య బీమా ప్రీమియంపై సెక్షన్ 80D కింద ప్రస్తుతం రూ. 25 వేలు (సీనియర్ సిటిజన్లకు రూ. 50 వేలు) మాత్రమే మినహాయింపు ఉంది. వైద్య ఖర్చులు ఏటా భారీగా పెరుగుతున్నప్పటికీ, ఈ పరిమితులు మారలేదు. వీటిని పెంచడం ద్వారా కుటుంబాల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
స్వీయ వినియోగ గృహాలపై గృహ రుణ వడ్డీకి ప్రస్తుతం రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఇళ్ల ధరలు, అధిక EMIలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ పరిమితిని రూ. 3 లక్షలకు పెంచడం లేదా కొత్త పన్ను విధానంలో తిరిగి ప్రవేశపెట్టడం అవసరం. NPS కోసం ఉన్న అదనపు రూ. 50 వేల మినహాయింపు ఇప్పుడు సరిపోవడం లేదు. దీన్ని కనీసం రూ. 1 లక్షకు పెంచితే ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో అధిక కార్పస్‌ను నిర్మించుకునే అవకాశం ఉంటుంది.
భారతదేశ పన్ను మినహాయింపు వ్యవస్థ మంచి ఉద్దేశంతో రూపొందించినప్పటికీ, మారని పరిమితులు దాని ప్రయోజనాన్ని తగ్గిస్తున్నాయి. బడ్జెట్ 2026లో ఈ పరిమితులను సవరించడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications