Budget 2026: ఉద్యోగం మారే వారికి గుడ్ న్యూస్? డబుల్ టాక్స్ సమస్యకు చెక్!
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) పై ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం మారే సమయంలో ఎదురయ్యే రెట్టింపు పన్ను (Double Taxation) సమస్యను పరిష్కరించాలని బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (BCCI) ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి కంపెనీ మారేటప్పుడు పాత సంస్థకు 'నోటీస్ పీరియడ్' (Notice Period) సర్వ్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే, ఆ కాలానికి సమానమైన జీతాన్ని పాత కంపెనీ రికవరీ చేస్తుంది. దీనికి తోడు 'జాయినింగ్ బోనస్' (Joining Bonus) షరతులు కూడా సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ రెండింటి వల్ల ఉద్యోగి చేతికి రాని డబ్బుపై కూడా పన్ను కట్టాల్సి వస్తోంది. ఉద్యోగులు జాబ్ స్విచ్ అయ్యేటప్పుడు ప్రధానంగా రెండు రకాల నష్టాలను ఎదుర్కొంటున్నారు..
1. నోటీస్ పే రికవరీ (Notice Pay Recovery)
పాత కంపెనీ రికవరీ చేసే నోటీస్ పే మొత్తాన్ని చాలా సందర్భాల్లో కొత్త కంపెనీ తిరిగి ఇస్తుంది (Reimbursement). కానీ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాత కంపెనీ ఆ మొత్తాన్ని గ్రాస్ శాలరీలో భాగంగా చూపిస్తూ టీడీఎస్ (TDS) కట్ చేస్తుంది. అటు కొత్త కంపెనీ కూడా ఆ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఆదాయంగా చూపి పన్ను విధిస్తుంది. ఫలితంగా ఉద్యోగికి ఆ డబ్బు అందకపోయినా.. రెండు సార్లు పన్ను పడుతోంది.
2. జాయినింగ్ బోనస్ రికవరీ
కొన్ని కంపెనీలు చేరిన వెంటనే బోనస్ ఇస్తాయి. కానీ, ఏడాది లోపు ఉద్యోగం వదిలేస్తే ఆ డబ్బును తిరిగి చెల్లించాలనే నిబంధన ఉంటుంది. ఆ బోనస్ తీసుకున్న ఏడాది పన్ను కట్టిన ఉద్యోగి.. అది తిరిగి చెల్లించేటప్పుడు దానికి ఎటువంటి డిడక్షన్ (Deduction) పొందలేకపోతున్నారు. దీనివల్ల ఉద్యోగులకు రెట్టింపు నష్టం జరుగుతోంది.
BCCI చేసిన కీలక ప్రతిపాదనలు ఇవే..
రాబోయే బడ్జెట్ (Budget 2026-27) కోసం మెమోరాండం సమర్పించిన BCCI.. ఈ క్రింది పరిష్కారాలను సూచించింది.
- జాయినింగ్ బోనస్ డిడక్షన్: ఉద్యోగి బోనస్ మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పుడు, ఆ మొత్తాన్ని ఆ ఏడాది శాలరీ ఆదాయం నుండి తగ్గించుకునేలా (Deduction) అనుమతించాలి.
- నోటీస్ పే పై క్లారిటీ: నోటీస్ పీరియడ్ లో రికవరీ చేసిన మొత్తం ఉద్యోగికి అందదు. కాబట్టి అది అతని ఆదాయం కిందకు రాకూడదని స్పష్టం చేయాలి. దానికి బదులు పాత కంపెనీ చేతిలో అది ఆదాయంగా పరిగణించి పన్ను వేయాలని సూచించింది.
- టీడీఎస్ క్రమబద్ధీకరణ: కొత్త కంపెనీ ఇచ్చే రీయింబర్స్‌మెంట్ పైన మళ్లీ పన్ను పడకుండా నిబంధనలు సవరించాలి.
కొత్త టాక్స్ విధానం (New Tax Regime) పై ఇంపాక్ట్
ప్రస్తుత కొత్త ట్యాక్స్ రెజీమ్ (New Tax Regime) లో స్టాండర్డ్ డిడక్షన్ మినహా చాలా మినహాయింపులు లేవు. 2026 బడ్జెట్‌లో ఒకవేళ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే.. అది కొత్త టాక్స్ విధానాన్ని ఎంచుకునే లక్షల మంది మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిస్తుంది. ఇప్పటికే కొత్త టాక్స్ రెజీమ్‌లో రూ. 12.75 లక్షల వరకు (స్టాండర్డ్ డిడక్షన్ కలిపి) ఎటువంటి పన్ను లేని విషయం తెలిసిందే.
ఏది ఏమైనా నోటీస్ పే రికవరీపై ప్రస్తుతం స్పష్టమైన చట్టం లేదు. కొన్ని కోర్టు తీర్పులు ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నా.. ఐటీ శాఖ మాత్రం దీనిని వ్యతిరేకిస్తూనే ఉంది. అందుకే ఈ బడ్జెట్‌లో స్పష్టమైన నిబంధన తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications