ఇకపై ఈ 3 స్కీమ్స్‌లోనే అసలైన లాభం.. ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు!
బడ్జెట్ 2026 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) పన్ను నిబంధనలపై ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు SGBలు మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే పన్ను ఉండేది కాదు. కానీ కొత్త రూల్ ప్రకారం, కేవలం ఆర్‌బీఐ (RBI) నుండి నేరుగా కొనుగోలు చేసిన వారికి మాత్రమే మెచ్యూరిటీ వద్ద పన్ను మినహాయింపు ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్ (Secondary Market) లో ఇతరుల దగ్గర నుండి ఈ బాండ్లను కొంటారో.. వారు ఇప్పుడు 'క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్' చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇన్వెస్టర్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. భారతదేశంలో EEE (Exempt-Exempt-Exempt) కేటగిరీ కిందకు వచ్చే కొన్ని పథకాలు ఉన్నాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు.. దానిపై వచ్చే వడ్డీపై చివరలో మెచ్యూరిటీ డబ్బు తీసుకునేటప్పుడు.. ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అవేంటో చూద్దాం..
1. పీపీఎఫ్ (Public Provident Fund - PPF)
మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన పథకం ఇది. ఇందులో ఏడాదికి కనిష్టంగా రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.
- మెచ్యూరిటీ కాలం: 15 ఏళ్లు.
- ట్యాక్స్ బెనిఫిట్: మీరు పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై అసలు పన్ను ఉండదు. ఇది పూర్తి సురక్షితమైన ప్రభుత్వ పథకం.
2. సుకన్య సమృద్ధి యోజన (SSY)
మీకు 10 ఏళ్ల లోపు వయసున్న కూతురు ఉంటే.. ఆమె భవిష్యత్తు కోసం ఇది ఉత్తమమైన పథకం. ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ రేటు (8.2%) అందిస్తున్నది ఇదే.
- ట్యాక్స్ బెనిఫిట్: ఇది కూడా EEE కేటగిరీ కిందకే వస్తుంది. కూతురు చదువు లేదా పెళ్లి కోసం మెచ్యూరిటీ సమయంలో తీసుకునే భారీ నగదుపై ఒక్క పైసా కూడా పన్ను కట్టక్కర్లేదు.
3. ఈపీఎఫ్ (Employees' Provident Fund - EPF)
ప్రభుత్వ , ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రతి నెలా మీ జీతం నుండి కొంత భాగం ఇందులో జమ అవుతుంది.
- ట్యాక్స్ బెనిఫిట్: ఉద్యోగి కంట్రిబ్యూషన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతుంది. 5 ఏళ్ల సర్వీస్ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే వడ్డీ , అసలు రెండింటిపై పన్ను ఉండదు. అయితే ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటే, ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీకి మాత్రం పన్ను వర్తిస్తుంది.
ఏది ఏమైనా బడ్జెట్ మార్పుల వల్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. గోల్డ్ బాండ్స్ (SGB)లు సెకండరీ మార్కెట్లో కొనేవారు పన్ను భారాన్ని లెక్కవేసుకోవాలి. అదే సమయంలో ట్యాక్స్ ఫ్రీ (Tax Free) రిటర్న్స్ కోరుకునే వారు పైన పేర్కొన్న ప్రభుత్వ పథకాలను ఎంచుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications