Budget 2026: బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్ మారబోతుందా? సామాన్యుడి ఆశలు నెరవేరతాయా!
మన దేశంలో మధ్యతరగతి వాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. పేపర్ మీద జీతం పెరుగుతోంది. కానీ, చేతికి వచ్చేసరికి మాత్రం చిల్లులే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 'ద్రవ్యోల్బణం' (Inflation). మార్కెట్లో నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల ఖర్చులు ఆకాశాన్ని అంటుతుంటే, మన ట్యాక్స్ స్లాబ్‌లు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సారి బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 30 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ను సవరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

30% ట్యాక్స్ స్లాబ్ ఎందుకు మారాలి?
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆదాయం ఒక పరిమితి దాటితే చాలు.. ఏకంగా 30 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు జీతం పెరిగినప్పుడు.. వారు తెలియకుండానే ఈ టాప్ ట్యాక్స్ బ్రాకెట్‌లోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వారి కొనుగోలు శక్తి (Purchasing Power) పెరగడం లేదు సరి కదా.. పన్ను భారం మాత్రం పెరుగుతోంది.
ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం రూ. 24 లక్షల పైన ఉన్న 30 శాతం స్లాబ్ ను కనీసం రూ. 35 లక్షల వరకు పెంచాలి. అప్పుడే మధ్యతరగతి ప్రజల చేతిలో తగినంత డబ్బు మిగులుతుంది.
ద్రవ్యోల్బణంతో ట్యాక్స్‌కు లింక్ (Inflation Indexing) అంటే ఏమిటి?
మనం కొనే వస్తువుల ధరలు ప్రతి ఏటా పెరుగుతుంటాయి. కానీ, మన ట్యాక్స్ ఫ్రీ లిమిట్ మాత్రం అలాగే ఉంటుంది. దీనినే 'బ్రాకెట్ క్రీప్' (Bracket Creep) అంటారు. అంటే ధరల పెరుగుదల వల్ల మీ జీతం పెరిగినా, రియల్ ఆదాయం పెరగదు. కానీ, మీరు ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తుంది. అందుకే ట్యాక్స్ స్లాబ్‌లను 'కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్' (CPI) తో లింక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ట్యాక్స్ లిమిట్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు లాభమేనా?
ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుందని కొందరు అనుకోవచ్చు. కానీ, ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటే వారు ఖర్చులు పెంచుతారు. దీనివల్ల:
- జీఎస్‌టీ (GST) పెరుగుతుంది: ప్రజలు కార్లు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు కొంటే ప్రభుత్వం పరోక్ష పన్నుల రూపంలో లాభపడుతుంది.
- పొదుపు పెరుగుతుంది: మధ్యతరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇన్వెస్ట్‌మెంట్లలో డబ్బు పెడతారు. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది.
- ట్యాక్స్ కట్టాలనే ఉత్సాహం: పన్నులు సరసంగా ఉంటే.. ప్రజలు పన్నులు ఎగ్గొట్టకుండా నిజాయితీగా చెల్లిస్తారు.
ఎవరెవరికి మేలు జరుగుతుంది?
- ఉద్యోగులు: టీడీఎస్ (TDS) రూపంలో కట్ అయ్యే డబ్బు తగ్గి, నెలకు చేతికి వచ్చే జీతం పెరుగుతుంది.
- స్వయం ఉపాధి (Self-Employed): వ్యాపారస్తులు తమ లాభాల్లో మూడో వంతు పన్నుకే ఇవ్వకుండా.. ఆ డబ్బును తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టవచ్చు.
- పెన్షనర్లు: రిటైర్ అయిన వారికి పెరిగే వైద్య ఖర్చుల దృష్ట్యా, ట్యాక్స్ మినహాయింపులు చాలా అవసరం.
కేంద్ర ప్రభుత్వం ఏం చేయవచ్చు?
కేవలం స్లాబ్‌లు పెంచడమే కాకుండా, హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే మినహాయింపు (Section 24b) పరిమితిని కూడా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం ద్వారా కూడా ఊరటనివ్వవచ్చు. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications