Budget 2026: బంగారంపై పన్ను బాదుడు తగ్గుతుందా? ఇన్వెస్టర్లు కోరుకుంటున్న మార్పులు ఇవే!
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. గత ఏడాది కాలంలో ఇండియాలో గోల్డ్ రేట్లు ఏకంగా 76 శాతానికి పైగా పెరిగినప్పటికీ.. పసిడిపై మన మోజు అస్సలు తగ్గలేదు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రజలు నగలు, కాయిన్స్ వంటి ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds), గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) , మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) లో పసిడిపై పన్ను నిబంధనల్లో కీలక మార్పులు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం బంగారంపై పన్ను ఎలా ఉంది?
బంగారాన్ని ఏ రూపంలో కలిగి ఉన్నా, దానిని అమ్మినప్పుడు వచ్చే లాభాలపై పన్ను (Capital Gains Tax) చెల్లించాల్సి ఉంటుంది.
- ఫిజికల్ గోల్డ్ (నగలు, నాణేలు): 24 నెలల కంటే తక్కువ కాలం ఉంచుకుని అమ్మితే 'షార్ట్ టర్మ్' కింద మీ ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం ట్యాక్స్ పడుతుంది. 24 నెలలు దాటితే 'లాంగ్ టర్మ్' (LTCG) కింద 12.5% పన్ను కట్టాలి.
- గోల్డ్ బాండ్లు (SGBs): వీటిపై వచ్చే 2.5% వడ్డీకి పన్ను ఉంటుంది. కానీ, ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభంపై (Capital Gains) ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. ఇది అతి పెద్ద అడ్వాంటేజ్.
- ETFs । మ్యూచువల్ ఫండ్స్: ఇవి కూడా ఫిజికల్ గోల్డ్ తరహాలోనే పన్ను విధింపును కలిగి ఉంటాయి.
Budget 2026 నుంచి ఆశిస్తున్న కీలక మార్పులు..
- పన్ను నిబంధనల సరళీకరణ: ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ మధ్య హోల్డింగ్ పీరియడ్స్ విషయంలో తేడాలు ఉన్నాయి. బడ్జెట్ (Budget 2026) లో అన్ని రకాల గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ లకు ఒకే రకమైన పన్ను నిబంధనలను (Parity) తీసుకురావాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు.
- జీఎస్టీ (GST) తగ్గింపు: ప్రస్తుతం బంగారం కొనుగోలుపై 3 శాతం GST విధిస్తున్నారు. రేట్లు విపరీతంగా పెరిగిన తరుణంలో ఈ GST రేటును తగ్గిస్తే సామాన్యులకు ఊరట లభించడమే కాకుండా అమ్మకాలు కూడా పెరుగుతాయని జ్యువెలరీ అసోసియేషన్లు భావిస్తున్నాయి.
- ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) తగ్గింపు: ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. దీనిని తగ్గించడం ద్వారా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చని, దేశీయ మార్కెట్‌లో ధరలు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
- డిజిటల్ గోల్డ్ ప్రోత్సాహకాలు: బంగారం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యంపై భారం పడుతోంది. దీనిని తగ్గించడానికి, ప్రభుత్వం Budget 2026 లో గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs), ఎస్‌జీబీ (SGB) లను మరింతగా ప్రోత్సహించేలా కొత్త రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది.
ఏదేమైనా పెరుగుతున్న ధరల దృష్ట్యా మీ గోల్డ్ పోర్ట్ ఫోలియోను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం బంగారం కొనాలి అనుకుంటున్నట్టయితే రాబోయే బడ్జెట్ (Budget 2026) అప్ డేట్స్ వచ్చే వరకు వేచి చూడటం తెలివైన పని.


Click it and Unblock the Notifications