బంగారం ధరలు భారీగా తగ్గాలంటే ఈ పని చేయండి.. కేంద్రానికి భారత జ్యూవెలరీ పరిశ్రమ కీలక ప్రతిపాదన..
దేశంలో పసిడి ధరలు రోజురోజుకీ కొత్త గరిష్ఠాలను తాకుతూ బంగారం ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2026 జనవరి ప్రారంభం నుంచే బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చి, డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ హై స్థాయిల్లో స్థిరపడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బంగారం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుందా? అనే అంచనాలు సామాన్య ప్రజల్లో పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం. 2024 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గించారు. ఈ నిర్ణయం అప్పట్లో దేశీయ బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

దిగుమతి సుంకం తగ్గిన తర్వాత దేశీయ మార్కెట్లో Gold ధరలు సుమారు 6 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో Gold దిగుమతులు 47 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా అక్రమ బంగారం రవాణా (స్మగ్లింగ్) కూడా కొంత మేరకు తగ్గినట్టు అధికారిక అంచనాలు వెల్లడించాయి. అధిక సుంకాల కారణంగా అక్రమ మార్గాల వైపు వెళ్లే వ్యాపారం తగ్గడం ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా మారింది.
ఇప్పుడు బంగారం ధరలు మళ్లీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడంతో.. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దిగుమతి సుంకం తగ్గితే వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఆభరణాల పరిశ్రమకు కూడా ఊరట లభిస్తుంది. అదే సమయంలో అక్రమ రవాణా తగ్గి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరిగే అవకాశముంది.
ఇప్పటికే భారతదేశంలోని గెమ్స్ & జ్యూవెలరీ (రత్నాలు, ఆభరణాలు) పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలను సమర్పించింది.ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా GST తగ్గింపు అంశం ఉంది. ప్రస్తుతం బంగారం, వెండి మరియు ఆభరణాలపై 3 శాతం GST అమల్లో ఉంది. అయితే ఇది వినియోగదారులపై అదనపు భారం అవుతోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఈ GST రేటును 1.25 శాతం లేదా గరిష్ఠంగా 1.5 శాతానికి తగ్గించాలని వారు కోరుతున్నారు.
మరో డిమాండ్ ఏంటంటే పన్నుల సరళీకరణ, నిబంధనల సడలింపు. గెమ్స్ & జ్యూవెలరీ రంగంలో ఎక్కువగా చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు) పనిచేస్తున్నాయి. వీటిపై ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనలు, రిటర్న్ దాఖలు ప్రక్రియలు, నోటీసుల భారం అధికంగా ఉందని పరిశ్రమ చెబుతోంది. అందువల్ల MSMEల పరిధిని విస్తరించి, మరింత మంది తయారీదారులు ఆ వర్గంలోకి రావడానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఒకే అంశంపై పునరావృతంగా వచ్చే నోటీసులను తగ్గించడం, రిటర్న్ దాఖలుకు ఎక్కువ గడువు ఇవ్వడం వంటి సంస్కరణలను కూడా ప్రతిపాదించింది.
అదేవిధంగా.. డిజిటల్ గోల్డ్ లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ లేదా డిజిటల్ చెల్లింపులపై వసూలు చేసే MDR (Merchant Discount Rate)ను తగ్గించాలని పరిశ్రమ సూచించింది. ఇలా చేస్తే ఆధునిక డిజిటల్ చెల్లింపులు మరింత ప్రోత్సాహం పొందుతాయని, వినియోగదారులు ఆభరణాల కొనుగోళ్లకు డిజిటల్ మార్గాలను ఎక్కువగా వినియోగిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా ముడి వజ్రాలు, కత్తిరించిన వజ్రాలు, రంగురంగుల రత్నాల దిగుమతిపై ప్రస్తుతం ఉన్న 4 శాతం Safe Harbour పన్నును తగ్గించాలని GJEPC డిమాండ్ చేసింది.
ఇతర ముఖ్యమైన ప్రతిపాదనల్లో టూరిస్ట్ GST రిఫండ్ స్కీమ్ అమలు కూడా ఉంది. విదేశీ పర్యాటకులు భారత్‌లో కొనుగోలు చేసిన ఆభరణాలపై చెల్లించిన GSTని విమానాశ్రయాల వద్ద తిరిగి పొందే విధానాన్ని అమలు చేస్తే, అంతర్జాతీయ కొనుగోలుదారులు భారత జ్యూవెలరీపై మరింత ఆసక్తి చూపుతారని పరిశ్రమ విశ్వసిస్తోంది. ఈ పథకాన్ని తొలుత ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రారంభించాలని సూచించింది.


Click it and Unblock the Notifications