Budget 2026: డెలివరీ బాయ్స్ నుండి ఫ్రీలాన్సర్ల వరకు.. బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!
భారతదేశంలో గిగ్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తోంది. డెలివరీ పార్ట్‌నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు ఇలా కోట్లాది మంది ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే వీరికి స్థిరమైన ఆదాయం కానీ, సామాజిక భద్రత కానీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పై ఈ వర్గాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల పనులు ఆగిపోయినప్పుడు తమను ఆదుకునే వ్యవస్థ కావాలని వారు కోరుతున్నారు.

వాతావరణ మార్పులు - ఆదాయానికి గండి
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు గిగ్ వర్కర్ల బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, అకస్మాత్తుగా వచ్చే వరదలు బయట పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. 'Plutas.AI' వ్యవస్థాపకులు అంకుర్ ఇంద్రకుష్ ప్రకారం.. కేవలం నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా, ఆదాయం ఆగిపోయిన వెంటనే ఆర్థిక సాయం అందే 'పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్' (Parametric Climate Insurance) వ్యవస్థను ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ప్రవేశపెట్టాలి. 2024-25లో ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. లక్షలాది ఇళ్లు, పశువులు నాశనమవ్వడం గమనార్హం.
యువతకు ఆర్థిక వెసులుబాటు
నేటి తరం యువత ఎక్కువగా ఫ్రీలాన్సింగ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ పై ఆధారపడుతున్నారు. వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి (Upskilling) భారీగా ఖర్చు చేస్తున్నారు. స్కేలర్ (Scaler) కో-ఫౌండర్ అభిమన్యు సక్సేనా అభిప్రాయం ప్రకారం.. ఈ బడ్జెట్ లోయువ సంపాదనపరులకు పన్ను మినహాయింపులు, సులభమైన విద్యా రుణాలు అందించాలి. దీనివల్ల వారు తమ కెరీర్‌పై ధైర్యంగా పెట్టుబడి పెట్టగలరు. 2047 నాటికి గిగ్ వర్క్‌ఫోర్స్ 6.2 కోట్లకు చేరుతుందని అంచనా. అందుకే ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.
డిజిటల్ లోన్ల విషయంలో జాగ్రత్త
ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు గిగ్ వర్కర్లు డిజిటల్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ క్రమంలో మోసపోకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు కావాలని స్టాష్‌ఫిన్ కో-ఫౌండర్ శ్రుతి అగర్వాల్ సూచించారు. వినియోగదారుల రక్షణ, పారదర్శకమైన వడ్డీ రేట్లు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బడ్జెట్ ద్వారా బలోపేతం చేయాలని ఆమె కోరారు. ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించి, గిగ్ వర్కర్ల క్రెడిట్ అర్హతను సరిగ్గా అంచనా వేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి.
మనుగడ నుండి రక్షణ వైపు..
ఏది ఏమైనా కేవలం సంక్షోభం వచ్చినప్పుడు సాయం చేయడం కంటే, సంక్షోభాన్ని ఎదుర్కొనేలా గిగ్ వర్కర్లను సిద్ధం చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యం కావాలి అని నిపుణులు కోరుతున్నారు. పన్ను ప్రోత్సాహకాలు, విపత్తు నిర్వహణతో అనుసంధానమైన ఇన్సూరెన్స్ పథకాలు మరియు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ద్వారా గిగ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. మరి ఈ సారి బడ్జెట్ (Budget 2026) ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూద్దాం!


Click it and Unblock the Notifications