Budget 2026: ఈ బడ్జెట్ ఇన్వెస్టర్ల కొంప ముంచుతుందా.. కాపాడుతుందా? కీలక విశ్లేషణ!
భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఒక రకమైన డైలమాలో ఉన్నారు. ఒకవైపు బడ్జెట్ (Budget 2026) మరికొద్ది గంటల్లో రాబోతుండగా.. మరోవైపు జనవరి నెలలో మార్కెట్ చూపించిన పతనం అందరినీ కలవరపెడుతోంది. గడచిన నెల రోజుల్లోనే నిఫ్టీ దాదాపు 1,000 పాయింట్ల మేర నష్టపోవడంతో.. ఈసారి బడ్జెట్ మార్కెట్ కు మళ్లీ ప్రాణం పోస్తుందా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే మార్కెట్ నిపుణులు ఈ బడ్జెట్‌ను ఒక 'నాన్-ఈవెంట్' గా అభివర్ణిస్తున్నారు.

ఏమిటీ నాన్ ఈవెంట్?
నాన్ ఈవెంట్ అంటే పెద్దగా ప్రభావం చూపని ఈవెంట్ అని అర్థం. సాధారణంగా బడ్జెట్ రోజున భారీ ఎత్తున మార్కెట్ పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుందని అందరూ భావిస్తారు. కానీ గత 15 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే బడ్జెట్ రోజున నిఫ్టీ కదలిక కేవలం 0.19 శాతంగా మాత్రమే నమోదు కావడం గమనార్హం. అంటే బడ్జెట్ ప్రకటనల కంటే అంతర్జాతీయ పరిణామాలు, ఆర్‌బీఐ (RBI) నిర్ణయాలే మార్కెట్ దిశను ఎక్కువగా నిర్దేశిస్తున్నాయి.
పెద్దగా అంచనాలు లేవు..
ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో బడ్జెట్ (Budget 2026) పై అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే అభివృద్ధికి పెద్దపీట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జెఫరీస్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ ప్రకారం.. ప్రభుత్వం రక్షణ రంగం (Defence) , మౌలిక సదుపాయాల (Infrastructure) పై చేసే పెట్టుబడి వ్యయం (CapEx) 10 శాతం వరకు పెరగవచ్చు. కానీ, వినియోగం (Consumption) పెంచడానికి అవసరమైన భారీ ఉద్దీపనలు లేదా పన్ను తగ్గింపులు పెద్దగా ఉండకపోవచ్చని మార్కెట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. అందుకే బడ్జెట్ లో ఎటువంటి ప్రతికూల వార్తలు లేకపోయినా మార్కెట్ దానిని సానుకూలంగానే స్వీకరిస్తుంది. నిఫ్టీ ఇప్పటికే 2 శాతం పైగా పడిపోయిన తరుణంలో బడ్జెట్ గనుక స్థిరంగా ఉంటే మార్కెట్ కనిష్ట స్థాయిల వద్ద స్థిరపడటానికి (Consolidation) అవకాశం ఉంటుంది.
టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం..
మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు (FIIs) నిరంతరం నిధులను ఉపసంహరించుకోవడం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం వంటి అంశాలు నిఫ్టీకి ప్రతిబంధకంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బడ్జెట్ లో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా చిన్న చిన్న రాయితీలు ఇస్తే అది మార్కెట్ కు ఒక పాజిటివ్ సర్‌ప్రైజ్ కావచ్చు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ 25,000 నుండి 25,500 మధ్య ఒక రేంజ్-బౌండ్ ట్రేడింగ్ జరిపే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంమీద ఈ సారి బడ్జెట్ (Budget 2026) ఇన్వెస్టర్లకు తక్షణమే భారీ లాభాలను తెచ్చిపెట్టకపోయినా అస్థిరంగా ఉన్న మార్కెట్‌ను స్థిరపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అనవసరమైన రిస్క్‌లు తీసుకోకుండా, బడ్జెట్ తర్వాత వచ్చే స్పష్టత ఆధారంగా పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని విశ్లేషకుల సలహా.


Click it and Unblock the Notifications