Budget 2026: క్రిప్టో ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్? 30% భారీ పన్ను భారం తగ్గబోతోందా!
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న కఠినమైన పన్ను నిబంధనలు ఇన్వెస్టర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) పై దేశీయ క్రిప్టో ఎకో సిస్టమ్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫ్లాట్ ట్యాక్స్ , ఒక శాతం TDS నిబంధనల్లో మార్పులు వస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

30% పన్ను & లాస్ సెట్-ఆఫ్ నిబంధనలు
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115BBH ప్రకారం, క్రిప్టో లావాదేవీల ద్వారా వచ్చే లాభాలపై ఏకంగా 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్టర్లకు ఉన్న ప్రధాన ఇబ్బంది ఏమిటంటే.. ఒక క్రిప్టో కాయిన్ లో వచ్చిన నష్టాన్ని మరో కాయిన్ లాభంతో సర్దుబాటు (Set-off) చేసుకునే అవకాశం లేదు. అంటే మీరు ఒక చోట నష్టపోయినా.. మరోచోట వచ్చిన లాభంపై పూర్తి పన్ను కట్టాల్సిందే. ఈ బడ్జెట్ (Budget 2026) లోనైనా ఈ లాస్ సెట్-ఆఫ్ నిబంధనలను స్టాక్ మార్కెట్ తరహాలో మార్చాలని నిపుణులు కోరుతున్నారు.
1% TDS భారం తగ్గుతుందా?
సెక్షన్ 194S కింద అమలవుతున్న 1 శాతం TDS వల్ల మార్కెట్లో లిక్విడిటీ దారుణంగా పడిపోయింది. చిన్న ఇన్వెస్టర్లు కూడా ప్రతి ట్రేడ్‌కు 1 శాతం కట్ అవ్వడం వల్ల నష్టపోతున్నారు. ఈ TDS రేటును 0.01% లేదా 0.1% కి తగ్గించాలని పాలిగాన్ ల్యాబ్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ మళ్లీ భారతీయ ఎక్స్‌ఛేంజ్ లకు మళ్లే అవకాశం ఉంది.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కడ ఉంది?
దుబాయ్ (UAE), సింగపూర్ వంటి దేశాల్లో వ్యక్తులకు 0 శాతం పన్ను ఉంటే, భారత్‌లో మాత్రం సుమారు 34.5% (సర్‌చార్జ్ కలిపి) పన్ను విధిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు తరలించడానికి (Capital Flight) దారితీస్తోంది. ఈ బడ్జెట్ (Budget 2026) లో ప్రభుత్వం కనీసం హోల్డింగ్ పీరియడ్ ఆధారంగా (Long term vs Short term) పన్ను రేట్లను సవరిస్తే, అది మార్కెట్‌కు పెద్ద ఊరటనిస్తుంది.
ITR ఫైలింగ్ & నివేదికలు
మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. ITR-2 లేదా ITR-3 ఫారమ్స్‌లో ఉన్న షెడ్యూల్ 'Schedule VDA' కింద ప్రతి లావాదేవీని విడివిడిగా నమోదు చేయాలి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్ సాయంతో క్రిప్టో లావాదేవీలపై గట్టి నిఘా ఉంచింది. కాబట్టి బడ్జెట్ (Budget 2026) లో పన్ను తగ్గినా తగ్గకపోయినా, ఇన్వెస్టర్లు మాత్రం తమ లాభాలను స్పష్టంగా వెల్లడించడం ఎప్పటికైనా క్షేమకరం.


Click it and Unblock the Notifications