budget 2025: ఈ ఏడాది బంగారం ధరలు తగ్గుతాయా ? జీఎస్టీ పై ఆభరణాల పరిశ్రమ అంచనాలేమిటి ?
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది. ఒక విధంగా పండగ సీజన్లో పసిడి ప్రయులకే నిరాశతో పాటు బంగారం కొనుగోళ్లు కూడా తగ్గాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అయితే గతేడాది బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయి ప్రజలను ఆశ్చర్యపరిచాయి. అప్పట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించారు. ఈసారి కూడా బంగారంపై జీఎస్టీని తగ్గించాలని నిర్మలా సీతారామన్‌ను వివిధ పార్టీలు అభ్యర్థించాయి. బహుశా ప్రభుత్వం వారి సూచనను అంగీకరిస్తే బడ్జెట్ తర్వాత ఈసారి కూడా బంగారం ధర భారీగా తగ్గొచ్చు. అయితే దీనికి సంభందించి ప్రకటన వెలువడినప్పుడే వరకు నిజమెంతో తెలుస్తుంది.
బంగారంపై జీఎస్టీ ఎంత?: ప్రస్తుతం బంగారంపై జీఎస్టీ రేటు 3 శాతంగా ఉంది. కాబట్టి మీరు 10 వేల విలువైన బంగారం కొన్నారని అనుకుందాం దీని పై జీఎస్టీ చార్జెస్ రూ.300. 2025 బడ్జెట్‌లో బంగారంపై జీఎస్టీ రేటును తగ్గించాలని ఆభరణాల పరిశ్రమ ప్రతిపాదించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 3 శాతం జీఎస్‌టీ అధిక భారమని, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది. అందుకే రానున్న బడ్జెట్‌లో బంగారంపై జీఎస్టీని 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని ఆభరణాల పరిశ్రమ సూచించింది. ఇది తమ వ్యాపారానికి మాత్రమే కాకుండా కస్టమర్లకు కూడా గొప్ప ఉపశమనం కలిగిస్తుందని వారు చెప్పారు. ఒకవేళ 2025 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై జీఎస్టీని తగ్గించినట్లయితే, అది ఆభరణాల ధరలను కూడా తగ్గిస్తుంది. దీంతో బంగారం అమ్మకాలు ఊపందుకుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది కస్టమ్స్ సుంకం కోత?: ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా కస్టమ్స్ సుంకం తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ హరీశ్ తెలిపారు. అందువల్ల ఈసారి ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలిపారు. సాధారణంగా భారతదేశంలో ప్రవేశపెట్టే బడ్జెట్ అంతర్జాతీయ బంగారం ధరలలో మార్పులకు దారితీయదు. కానీ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తే, అది దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ చర్య పసిడి ప్రియులకు, సామాన్యులకు ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.


Click it and Unblock the Notifications