Budget 2025: కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రకటించటానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు బడ్జెట్ ఎలాంటి ప్రయోజనాలను ప్రకటిస్తుందనే ఆశావాదంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పెన్షనర్లకు పెద్ద శుభవార్త రాబోతోందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో సామాజిక భద్రత ప్రయోజనాలను అందించే అటల్ పెన్షన్ యోజన కింద అందిస్తున్న ప్రయోజనం మెుత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కనీస గ్యారెంటీ మెుత్తాన్ని రూ.10,000లకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పింఛను మెుత్తం రూ.1000 నుంచి రూ.5000 వరకు అందించబడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఈ మెుత్తాన్ని పెంచటం వల్ల బలహీన వర్గాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

చాలా పాపులర్ అయిన సామాజీక భద్రత స్కీమ్ అటల్ పెన్షన్ యోజన గురించి ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదనే విషయం వాస్తవం. అసలు ఈ స్కీమ్ గురించి వివరాలను తెలుసుకుంటే.. దీనిని ప్రధాని మోదీ మే 9, 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక ఆసరాను కల్పించే యోచనతో దీనికి రూపకల్పన చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుమీద దీనిని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన వ్యక్తులు 60 ఏళ్లు పైబడిన తర్వాత ఈ స్కీమ్ ప్రయోజనాలను అందుకుంటారు.
అక్టోబర్ 2024 నాటికి మెుత్తంగా దేశంలో 7 కోట్ల కంటే ఎక్కువ మంది స్కీమ్ కింద ప్రయోజనాలను పొందటానికి నమోదు చేసుకున్నారు. అటల్ పెన్షన్ యోజనను ప్రోత్సహించడంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కీలక పాత్ర పోషించింది. అయితే స్కీమ్ కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులు ముందుగానే తమకు నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు ఎంత పెన్షన్ కావాలనే ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. దీనికి అనుగుణంగానే ప్రీమియం నిర్ణయించబడుతుంది.
వివరాల్లోకి వెళితే నెలకు రూ.1000 పెన్షన్ రావాలనుకునే 18 వ్యక్తి నెలకు రూ.42 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.5000 పెన్షన్ కావాలనుకునే 40 ఏళ్ల వ్యక్తి నెలకు గరిష్ఠంగా రూ.1451 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. పెన్షనర్ మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామి జీవితాంతం ఈ పెన్షన్ పొందవచ్చు. ఇద్దరూ మరణించిన సమయంలో మాత్రం మెుత్తం వడ్డీ, ఆదాయం నామినీకి అందించబడుతుంది.


Click it and Unblock the Notifications