Budget 2022: 400 కొత్త వందేభారత్ రైళ్లు, విద్యార్థులకు ఈ-కంటెంట్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఐపీవో త్వరలో రానుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. నేడు (ఫిబ్రవరి 1) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటనలు చేశారు. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. ప్రధాని గతి శక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేలా బడ్జెట్ ఉంటుందన్నారు.
పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌తో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఉంటుందన్నారు. పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణసహిత అభివృద్ధికి ఊతమిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. కొండ ప్రాంతాల్లో పర్యాటక ప్రాంత అభివృద్ధికి తగిన అవకాశాలు ఉన్నాయన్నారు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్ వేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో రోప్ వే నిర్మాణం 60 కిలో మీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(PLI) స్కీంకు మంచి స్పందన లభించిందని తెలిపారు. అరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. 14 రంగాలు అభివృద్ధి సాధించాయన్నారు.
వచ్చే మూడేళ్లలో 400 న్యూ-జనరేషన్ వందే భారత్ రైళ్లను తీసుకువస్తామని తెలిపారు. 100 పీఎం గతి శక్తి టెర్మినల్స్‌ను వచ్చే మూడేళ్లలో డెవలప్ చేస్తామన్నారు. స్థానిక వ్యాపారాలకు సహకరించే ఉద్దేశ్యంలో భాగంగా వన్ స్టేషన్, వన్ ప్రోడక్ట్ కాన్సెప్ట్‌ను ప్రకటించారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్‌ఫామ్ తీసుకు వస్తామని తెలిపారు. మార్కెటింగ్ కోసం నూతన పోర్టల్ తీసుకు వస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులు, సహకారం ఉంటుంది. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్ లైన్‌లో నేర్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకం అందిస్తామన్నారు. క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధుల కేటాయింపు.
వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌కు సాయమందిస్తామని తెలిపారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం తీసుకు వస్తామన్నారు. వంట నూనెల కోసం దిగుమతులపై దేశీయంగా దిగుబడి పెంచుతామని తెలిపారు. పీపీపీ నమూనాలో ఆహారశుద్ధి పరిశ్రమలకు ఊతమిస్తామని తెలిపారు.
నదుల అనుసంధానానికి డీపీఆర్ సిద్ధం చేశామని, ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు ట్రిబుల్ ఐటీకి సాంకేతిక సాయం ఉంటుందన్నారు. ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానల్లు 12 నుండి 200కు పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఇస్తామని, ఉపాధ్యాయులకు ప్రపంచస్థాయి ఉపకరణాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విద్యార్థులకు ఈ-కంటెంట్ అందుబాటులోకి తెస్తామన్నారు.


Click it and Unblock the Notifications