Budget 2020: ఫోన్ కూడా లేదు.. ఈ మెయిల్స్ బ్లాక్.. హల్వా వేడుక 'రహస్యం' ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2020-21 డాక్యుమెంట్స్ ముద్రణకు ముందు హల్వా వేడుకను నిర్వహిస్తారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం (జనవరి 20) హల్వా సెరామనీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అధికారులు పాల్గొన్నారు. సీతారామన్ హల్వాను రుచి చూశారు.

బడ్జెట్ అంశాలు రహస్యం
హల్వా వేడుక తర్వాత బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రాసెస్ ప్రారంభమౌతుంది. హల్వా వేడుక చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. భారతీయ వంటకం అయిన హల్వాను పెద్ద కడాయిలో తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ సిబ్బందికి అందరికీ వడ్డిస్తారు. బడ్జెట్‍కు ముందు సంప్రదాయం ప్రకారం హల్వా వేడుక నిర్వహించి, బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను రహస్యంగా ఉంచుతారు.

10 రోజుల ముందు డాక్యుమెంట్స్ ప్రచురణ
బడ్జెట్ కసరత్తు ప్రారంభమవ్వగానే నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకరులను కూడా అనుమతించరు. ఆర్థిక శాఖకు చెందిన కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్ సమర్పించడానికి 10 రోజుల ముందు డాక్యుమెంట్స్ ముద్రిస్తారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో ఇది జరుగుతుంది.

10 రోజులు అక్కడే
హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో నేరుగా సంబంధం ఉన్న అధికారులు, సహాయక సిబ్బంది ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉంటుంది. వారి కుటుంబాలతోను సంబంధాలు ఉండవు. అంటే బడ్జెట్‌తో సంబంధం ఉన్న సిబ్బంది ఈ పది రోజుల పాటు అక్కడే ఉంటారు.

అప్పటి దాకా అనుమతి లేదు..
ఆర్థికమంత్రి లోకసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే వరకు... ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉంటారు. కనీసం వారు ఫోన్ ద్వారా లేదా ఈ-మెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్స్ వంటి వాటి ద్వారా కనీసం కుటుంబ సభ్యులను కూడా సంప్రదించలేరు.

అత్యవసర పరిస్థితుల్లో...
బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే అన్ని వసతులు కల్పిస్తారు. అత్యవసరమైతే.. అదీ భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు.

ఆర్థికమంత్రి వద్ద కూడా ఉండవు...
బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలు ఆర్థికమంత్రి వద్ద కూడా ఉండవు. ఇవి మొత్తం జాయింట్ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. తద్వారా బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టడానికి ముందు ఎలాంటి లీక్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ-మెయిల్స్ బ్లాక్ చేస్తారు
బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంప్యూటర్లలో ఈ మెయిల్ సౌకర్యాన్ని బ్లాక్ చేస్తారు. బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు పీఐబీ అధికారులను అనుమతిస్తారు. వారు బడ్జెట్ తర్వాత చేయాల్సిన పత్రికా ప్రకటనలను పరిశీలిస్తారు.

ప్రతి ఒక్కరికీ గుర్తింపు
బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్‌కు ముందు హల్వా వేడుకను చేస్తారు. భారతీయ వంటకం హల్వా వేడుకను నిర్వహించే సంప్రదాయం ద్వారా ఈ బడ్జెట్ తయారీలో భాగమైన సిబ్బంది కృషిని గుర్తించి, ప్రశంసించడం కూడా.

1980 నుంచి నార్త్ బ్లాక్‌లో...
1950కి ముందు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ప్రింట్ చేసేవారు. కానీ అక్కడి నుంచి లీక్ కావడంతో దానిని మింట్ రోడ్డులోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. 1980లలో దీనిని నార్త్ బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications