BSNL News: కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఫీచర్.. Jio, Airtel, Viకి గట్టిపోటీనే..
BSNL Self Care App: దేశీయ టెలికాం వ్యాపారంలో బీఎస్ఎన్ఎల్ అతిపెద్ద ఆటగాడిగా అవతరించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ రంగంలో ప్రైవేటు ఆటగాళ్ల హవా ఒకపక్క కొనసాగుతుండగా.. మరోపక్క ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ స్పెషల్ ఫీచర్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ తాజాగా జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియాలు తమ యూజర్లకు అందించని సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రోజూ కోట్ల మంది టెలికాం యూజర్లు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
దేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు కొన్ని నెలల కింద తమ టారిఫ్ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జియో రేట్ల పెంపును ప్రారంభించగా దానిని ఇతర ఆపరేటర్లు ఫాలో అయ్యారు. ప్రధానంగా కంపెనీలు 5జీ పెట్టుబడులు, నెట్ వర్క్ విస్తరణపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టడంతో ఆ ఖర్చులను భర్తీ చేసుకునేందుకు వీలుగా రేట్ల పెంపుకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో చాలా మంది ఘర్ వాపసీ నినాదంతో తిరిగి బీఎస్ఎన్ఎల్ వైపు మారారు. అయితే యూజర్లను సంతోష పెట్టేందుకు వేగంగా 4జీ సేవల విస్తరణను కొనసాగిస్తున్న ప్రభుత్వ టెలికాం దిగ్గజం 5G నెట్‌వర్క్‌లను పరిచయం చేసేందుకు సైతం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలోనే తన యూజర్లకు స్పామ్ కాల్స్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సులభతరమైన పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్పామ్, నకిలీ కాల్స్ సందేశాలను నిరోధించేందుకు వినియోగదారులు BSNL సెల్ఫ్ కేర్ యాప్‌కి వెళ్లి కొన్ని వివరాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లు ఇలాంటి సర్వీస్ అందించటం లేదని తెలుస్తోంది. కస్టమర్ తనకు ఇబ్బంది కలిగించే నకిలీ సందేశాలు లేదా కాల్స్ గురించి ఇక సులువుగా ఫిర్యాదు చేయవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇందుకోసం సెల్ఫ్ కేర్ యాప్‌లో ఎడమవైపు ఉన్న మూడు లైన్ల మెనుపై క్లిక్ చేసి.. అందులో ఫిర్యాదుల ఎంపికపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఎస్ఎమ్ఎస్ లేదా వాయిస్ ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
నిరంతరం కొత్త కస్టమర్ల చేరికను చూస్తున్న ప్రభుత్వ టెలికాం దిగ్గజం టాటాలతో జతకట్టిన తర్వాత తిరిగి పూర్వ వైభవాన్ని పొందేదిశగా ప్రయాణం కొనసాగిస్తోంది. BSNL 4జీ, 5జీపై పనిచేస్తున్న వేళ ఇప్పటికే అగ్రఆటగాడు జియో యూజర్లను కోల్పోయి కొంత నష్టాన్ని చూడగా.. వొడఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ అధిక సంఖ్యలో కస్టమర్లను కోల్పోతున్నాయి. దాదాపు దశాబ్ధకాలం నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ కంపెనీ ప్రస్తుతం తిరిగి పుంజుకుంటూ సరసమైన ధరలకు సేవలను అందుబాటులోకి తీసుకురావటంపై యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications