Silver Rate: గడచిన కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా సైతం గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేట్ల పెరుగుదల కొనసాగుతుందా లేక త్వరలో తగ్గుతాయా అనే అయోమయంలో చాలా మంది కొనుగోలుదారులు ఉన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న సమయంలో బంగారం కంటే వెండిని నమ్ముకోవటం ఉత్తమంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆభరణాల కొనుగోలుదారులు కాకుండా పెట్టుబడికోసం ఈ లోహాల్లో అవకాశాలను అన్వేషిస్తున్న వ్యక్తులు వెండికి ప్రాధాన్యత ఇవ్వటం లాభదాయకంగా ఇటీవలి నివేదికల ప్రకారం తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈ పరిస్థితిలో ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.లక్ష మార్కును ఇప్పటికే అందుకుంది. మరికొద్ది నెలల్లో రూ.1.25 లక్షలకు పెరగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది.

దేశీయంగా క్రమంగా పెరుగుతున్న పారిశ్రామిక ఉత్పత్తిలో వెండి వినియోగం పెరగడం వల్ల 2024లో దిగుమతులు క్రమంగా పెరిగాయని తెలుస్తోంది. రేట్లు పెరిగినప్పటికీ భారతీయ ప్రజలు గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సంపదను నిల్వచేయటానికి వీటిని వారు సాధనాలుగా వినియోగిస్తుంటారు.
ఇటువంటి పరిస్థితుల్లో వెండి కేజీ రేటు రూ.1.25 లక్షలకు చేరవచ్చనే అంచనాలు సిల్వర్ డిమాండ్ మరింతగా పెంచవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. గడచిన కొన్ని నెలల్లో వెండి ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. అయితే పెట్టుబడి ఉద్దేశం ఉన్న ఇన్వెస్టర్లు రానున్న కాలంలో ధర తగ్గింపులను కొనుగోళ్లకు అవకాశంగా భావించొచ్చని బ్రోకరేజ్ పేర్కొంది.
రానున్న 12-15 నెలల్లో వెండి ధర దేశీయంగా కేజీకి రూ.1,25,000 చేరుకుంటుందని, అమెరికాలో ఔన్సు ధర 40 డాలర్లకు చేరవచ్చని అంచనాలు చెబుతున్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి, వినియోగదారుగా ఉంది. కాబట్టి చైనా మరింత వెండిని కొనుగోలు చేస్తే, అది తప్పనిసరిగా దాని ధరపై ప్రభావం చూపుతుంది. చైనా గత 2 నెలలుగా బంగారం కొనుగోళ్లను నిలిపివేసింది. దీని ఫలితంగా చైనీయులు వెండిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2024లో మొత్తం డిమాండ్ దాదాపు 1,219 టన్నులు ఉంటుందని అంచనా వేయబడింది. అలాగే పారిశ్రామిక డిమాండ్ 710.9 టన్నులకు మించి ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications