Barclays: బ్రిటీష్ బ్యాంకింగ్ రంగంలో కలకలం.. గోల్డ్‌మన్ శాచ్స్, సిటీ గ్రూప్ బాటలోకి బార్క్లేస్..
Barclays: కొంత మేర భారత్ లో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఇటీవల అమెరికాకు చెందిన పలు బ్యాంకులు సంక్షోభంలోకి కూరుకుపోయాయి. తాజాగా బ్రిటీష్ బ్యాంకింగ్ దిగ్గజం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది.
అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా.. పలు దిగ్గజ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సిబ్బందిని తొలగించేందుకు వెనకాడటం లేదు. ప్రముఖ బ్రిటీష్ బ్యాంకింగ్ మరియు ఇన్వెస్ట్ మెంట్ సంస్థ బార్క్లేస్ ప్రస్తుతం ఉద్యోగాల కోతకు దిగింది.

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు బార్క్లేస్ రెడీ అయింది. ట్రేడింగ్ విభాగంలో క్లయింట్ ఫేసింగ్ సిబ్బందితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు డీల్ మేకర్లను తగ్గించుకోవాలని భావిస్తోంది. బ్యాంక్ తన వర్క్ ఫోర్స్ లో దాదాపు 5 శాతం అంటే 400 మందికి ఉద్వాసన పలకాలని యోచిస్తోంది.
'క్లయింట్స్ అవసరాల నిర్వహణ సామర్థ్యాన్ని నిర్థారించుకోవడానికి మా కార్యకలాపాలను క్రమంగా సమీక్షిస్తాము. వదంతులను నమ్మొద్దు' అని బార్క్లేస్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన రెండవ రౌండ్ లేఆఫ్స్ లో భాగంగా దాదాపు 3 వేల మంది ఉద్యోగులను తొలగించింది. గోల్డ్ మన్ శాచ్స్, సిటీ గ్రూప్ కూడా అదేబాటలో నడవగా.. ఇప్పుడు బార్క్లేస్ కూడా వాటిని అనుసరిస్తోంది.


Click it and Unblock the Notifications