Britannia : FMCG దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ రకాల బిస్కెట్లను తయారు చేస్తూ, ఏళ్ల తరబడి మార్కెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తన పెట్టుబడిదారులకు ఆ కంపెనీ ఓ శుభవార్త వినిపించింది. FY23కి గాను భారీ మొత్తంలో డివిడెండ్ ను ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అందుకే ఇన్వెస్టర్లు సైతం బ్రిటానియాను డివిడెండ్ స్టాక్స్ లో రారాజుగా పిలుచుకుంటారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 7200 శాతం మధ్యంతర డివిడెండ్ ను బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రకటించింది. అంటే ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.72 చొప్పున చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తన రెగ్యూలేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఇందుకోసం ఏప్రిల్ 13ను రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు పేర్కొంది. డివిడెండ్ మొత్తం చట్ట ప్రకారం నిర్ణీత వ్యవధిలో జమచేయనున్నట్లు తెలిపింది.

లిస్టెడ్ స్టాక్ లు ప్రస్తుతం T+1 సెటిల్ మెంట్ ఎంపికను అనుసరిస్తున్నందున.. రికార్డు తేదీ అయిన ఏప్రిల్ 13నే బ్రిటానియా షేర్లు ఎక్స్-డివిడెండ్ గా మారతాయి. అంటే ఆరోజు నాటికి కంపెనీ రిజిస్ట్రార్ లో షేర్ హోల్డర్ గా నమోదైన ప్రతి ఒక్కరూ ఈ మధ్యంతర డివిడెండ్ ను స్వీకరించడానికి అర్హులు అవుతారు అన్నమాట. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే FY23లో దాదాపు 33 శాతం అధిక డివిడెండ్ ప్రకటించడం గమనార్హం.
గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీ డివిడెండ్ ప్రయోజనాలను చెల్లించడంలో బ్రిటానియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. FY22లో ఈక్విటీ షేరుకు రూ.56.5(5650 శాతం), FY21లో రూ.12.50(1250 శాతం) డివిడెండ్ ను చెల్లించింది. Q3FY23లో సంస్థ నిర్వహణ లాభం 55 శాతం పెరిగి 760 కోట్లకు చేరుకుంది. తద్వారా నికర లాభం 151 శాతం ఎగబాకి 932 కోట్లకు వెళ్లింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.04 లక్షల కోట్లకు పైగా ఉంది.


Click it and Unblock the Notifications