కోల్‌కతాలో బ్రిటానియా ఫ్యాక్టరీ క్లోజ్.. సడెన్ నిర్ణయంతో రాజకీయ అలజడి..
Britannia Industries: దేశంలోని అత్యంత పురాతన వ్యాపార సంస్థల్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఒకటి. అయితే కంపెనీ తాజాగా తన ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని తీసుకున్న నిర్ణయం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
బ్రిటానియా బిస్కెట్స్ దేశంలోని ప్రజలకు పరిచయం అవసరం లేని ఉత్పత్తులు. స్వాతంత్య్రానికి ముందు నుంచి వ్యాపారం చేస్తున్న ఈ పెద్ద కంపెనీ తాజాగా తన కోల్‌కతా యూనిట్‌ను మూసివేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ సైతం సమాచారం అందించింది. అయితే ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ లో బీజేపీ-టీఎంసీల మధ్య రాజకీయంగా మాటల యుద్ధానికి కారణమైంది. రాష్ట్రంలోని తారాటాలా ప్రాంతంలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌కి పురాతన కర్మాగారం మూతపడటం చరిత్రలో పెద్ద శకానికి ముగింపుగా నిలవనుంది.

ప్రస్తుతం వేల కోట్లు విలువైన బ్రిటానియా ఇండస్ట్రీస్ 1892లో కేవలం రూ.295 పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కంపెనీ వ్యాపారం వేగంగా వృద్ధిని సాధించింది. అయితే తర్వాత దీనిని బ్రిటీష్ వ్యాపారవేత్తల నుంచి వాడియా కుటుంబం కొనుగోలు చేసింది. వీరు బ్రిటానియా బిస్కెట్లను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 1910లో ఎలక్ట్రిక్ మిషన్ సహాయంతో బిస్కెట్లను తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 1921లో ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ ఇండస్ట్రియల్ గ్యాస్ ఓవెన్‌లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.
వ్యాపారం దినదినాభివృద్ది చెందటంతో 1924లో కంపెనీ ముంబైలో కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పింది. ప్రస్తుతం దేశంలో 13 తయారీ ఫ్యాక్టరీలను కలిగి ఉన్న కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తూ వార్షికంగా రూ.9000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది. కోల్‌కతా నుంచి ప్రారంభమైన ఈ సంస్థ తారాటాలలో ఉన్న చారిత్రాత్మక కర్మాగారాన్ని మూసివేయడం నగర ఆర్థిక చరిత్రకే కాకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పెద్ద ఎదురుదెబ్బ. గత ఏడాది మే నుంచి కంపెనీ ఇక్కడ ఉత్పత్తిని నిలిపివేసింది. యూనిట్ మూతపడటంతో 122 మంది శాశ్వత ఉద్యోగులు, 250 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోనున్నారు.
బ్రిటానియా బిస్కెట్‌కు చెందిన కోల్‌కతా యూనిట్‌ను కంపెనీ మూసేయటంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. దోపిడీకి పాల్పడే పార్టీ సమక్షంలో పరిశ్రమ రాదని ముఖ్యమంత్రికి పరిశ్రమ వ్యతిరేక ఇమేజ్ కూడా ఉందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ఆరోపించారు. ఇదే క్రమంలో బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో నేడు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీని మూసివేయడం బెంగాల్ పతనానికి ప్రతీక అంటూ పోస్ట్ చేశారు. బీజేపీ నేతల ఆరోపణలను టీఎంసీ నాయకుడు కునాల్ ఘోష్ తిప్పికొట్టారు. కంపెనీ సొంత నిర్వహణ కారణాల కారణంగా ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తున్నట్లు ఆయన బదులిచ్చారు. దీనిని బెంగాల్ రాష్ట్రంలోని మొత్తం పారిశ్రామిక పరిస్థితులతో కలపడం తప్పన్నారు. ఈ ప్రభావం నేడు కంపెనీ షేర్లపై కూడా మార్కెట్లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications