Infosys: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ తన ఆదాయాల గురించిన రిపోర్టును ప్రకటించింది. త్రైమాసికంలో రూ.6,134 కోట్ల బలమైన లాభాలను నమోదు చేసింది. అయినప్పటికీ కంపెనీ మార్కెట్ అంచనాలను అందుకోవటంలో విఫలమైంది.
ఈ క్రమంలో కంపెనీ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఒక్కో షేరుపై రూ.17.50 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అయితే కంపెనీ తీసుకున్న నిర్ణయం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భార్య అక్షత మూర్తికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత ఇన్ఫోసిస్ సంస్థలో 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.

కంపెనీ డివిడెండ్ చెల్లింపుకు జూన్ 2, 2023ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీంతో కంపెనీ నుంచి అక్షత రూ.68.17 కోట్లను ఆదాయంగా పొందనున్నారు. గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన ఒక్కో షేరుపై రూ.16.50 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ.132.4 కోట్లను ఆమె డివిడెండ్ ఆదాయంగా పొందనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ మెుత్తంగా ఒక్కో షేరుకు రూ.31ని డివిడెండ్ల రూపంలో చెల్లించింది. ఇది అక్షతకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
ఇదిలా ఉండగా రిషి సునక్ భార్య అక్షతా మూర్తి జాతీయతపై యూకేలో పెద్ద చర్చ జరిగింది. యూకే ప్రధాని రిషి సునక్ బ్రిటన్ జాతీయుడు కాగా ఆమె భార్య మాత్రం భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. దీంతో బ్రిటన్‌లో 15 సంవత్సరాల వరకు పన్నులు చెల్లించకుండా విదేశాల్లో డబ్బు సంపాదించడానికి అనుమతించే ఆమె నివాసేతర హోదా UKలో విభజన సమస్యగా మారింది. రిషి ప్రధాని రేసులో ఉన్న తరుణంలో భార్య అక్షత బ్రిటన్ పౌరసత్వం తీసుకోకపోవటం పెద్ద చర్చకు కారణమైంది.

అక్షత.. తల్లి సుధా మూర్తి స్వస్థలమైన ఉత్తర కర్ణాటకలోని హుబ్బల్లిలో జన్మించింది. కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కాలేజీకి వెళ్లడానికి ముందు బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించింది. అక్కడ ఆమె ఆర్థికశాస్త్రం, ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్‌తో పట్టభద్రురాలైంది. ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె స్టాన్‌ఫోర్డ్‌లో MBA చదువుతున్న సమయంలో రిషి సునక్‌ను కలిసింది. రిషి-అక్షతల వివాహం 2009లో జరిగింది.


Click it and Unblock the Notifications