Gold: అమెరికా నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని తీసుకెళ్లిన నెదర్లాండ్..
అమెరికా, ఇరాన్ యుద్ధం, అమెరికా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు. దీంతో సురక్షితమైన పెట్టుబడి మార్గాలను వెతుకుతున్నారు. బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఆర్థిక మాద్యం వచ్చే ప్రమాదం ఉందని కొన్ని దేశాలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. చైనా, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా దాచుకున్న బంగారాన్ని కొన్ని దేశాలు తమ బంగారాన్ని తిరిగి తరలిస్తున్నాయి. గత వారం నెదర్లాండ్స్ అమెరికాలో దాచుకున్న బంగారాన్ని లండన్‌కు బదిలీ చేసింది.
ఇందుకు సంబంధించి ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్లిష్ట సంక్షోభానికి ముందస్తు తయారీ అంటూ చెప్పింది. అమెరికా నుంచి పలు దేశాలు బంగారాన్ని ఎందుకు తరలిస్తున్నాయని ప్రశ్నగా మారింది.
నెదర్లాండ్స్ ఒక్కటే కాకుండా కొద్ది రోజుల ముందు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల కేంద్ర బ్యాంకులు అమెరికాలో దాచిన పసిడి తిరిగి తీసుకుంటున్నాయి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకోవడానికి బంగారాన్ని విక్రయించడం, తనఖాపెట్టడం వంటి చర్యలను వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ద్రవ్యలభ్యతను పెంచుకొని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి బంగారం ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాలు ముందు జాగ్రత్త పడుతున్నాయన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. వివిధ దేశాల్లోని సాయుధ ఘర్షణలు ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని దేశాలపైనా వాణిజ్య సుంకాలను విధిస్తుండడంతో ఆర్థికపరమైన అనిశ్చితీ నెలకొంది. చిరకాల మిత్ర దేశం, పొరుగునున్న కెనడాపై కూడా ట్రంప్ కాలుదువ్వుతున్నారు.
అమెరికాలో ప్రచ్చన్న యుద్ధ కాలం నుంచి నిల్వ చేసిన బంగారంపై ఐరోపా దేశాలు వ్యూహాలను మార్చుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అమెరికా, కెనడాలలో నిల్వ చేసిన 313 టన్నుల బంగారంలో దాదాపు 86 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్.. లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాకు తరలించింది. న్యూయార్క్ నుంచి 111 టన్నుల బంగారాన్ని తరలించినట్లు జర్మనీకి చెందిన బుందెష్‌బ్యాంక్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
