Brightcom Share: బ్రైట్‌కామ్ షేర్లలో భూకంపం.. SEBI చర్యలతో విక్రయాల వెల్లువ..
Brightcom Share: ఈరోజు స్టాక్ మార్కెట్లో బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ షేర్లపై అందరి దృష్టి ఉంది. సెబీ చర్యలతో ఒక్కసారిగా స్టాక్ కుప్పకూలింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనల భూకంపాన్ని సృష్టించింది.
కంపెనీ షేర్లు బీఎస్ఈలో 5 శాతం లోయర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి. దీంతో కంపెనీ షేర్ ధర రూ.22.98కి పడిపోయింది. అయితే ఈ మహా పతనం వెనుక పెద్ద కారణమే ఉంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మతో సహా 23 మందిపై నిషేధం విధించింది. Brightcom షేర్లను విక్రయించకుండా అడ్డుకుంది. ఇదే క్రమంలో కంపెనీ ఛైర్మన్, సీఎఫ్ఓలను కంపెనీ బోర్డు నుంచి నిషేధిస్తున్నట్లు సెబీ ప్రకటించటంతో తాజా పరిణామాలు ఉత్పన్నమయ్యాయి.

దీనిపై స్పందించిన శంకర్ శర్మ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి అవసరమైన అన్ని రెమిటెన్స్ వివరాలను సమర్పించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. బ్రైట్‌కామ్ ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపులకు సంబంధించి అవకతవకలను "స్పష్టంగా" గుర్తించిన తర్వాత సెబీ తాజాగా ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. శర్మకు సెబీ అందించిన నోటీసు నెం-25 ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.37.77 చొప్పున 1,50,00,000 వారెంట్లు జారీ చేయబడ్డాయి. దీనికింద కంపెనీకి రూ.56.66 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.39.98 కోట్లు మాత్రమే అందినట్లు వెల్లడైంది. దీంతో అకౌంటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదే క్రమంలో బ్రైట్‌కామ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, సీఎఫ్‌ఓ నారాయణ్ రాజు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థల్లో డైరెక్టర్ లేదా ఏదైనా కీలకమైన మేనేజర్ పదవిని నిర్వహించకుండా సెబీ ఆంక్షలు విధించింది. FY 2021, FY 2022లో నాలుగు సందర్భాల్లో జారీచేసిన ప్రిఫరెన్షియల్ షేర్ల విషయంలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు బయటకు రావటంతో సెబీ రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించింది.


Click it and Unblock the Notifications