BRICS Trade: కారణాలేమైనా కానీ గ్రూపులు కట్టడంలో పాశ్చాత్య దేశాలకు ఎవరూ సాటిరారు. ప్రపంచం మొత్తం అమెరికా లేదా రష్యా మిత్ర దేశాలుగా ఉండాలే కానీ తటస్థంగా ఉంటాం అంటే మాత్రం సహించవు. భారత్ వంటి అలీన దేశం కూడా ఒక్కోసారి వారి పోకడలను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అది మన మంచికే కావడం హర్షణీయం.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహమే బ్రిక్స్(BRICS). ఈ సమూహంలోని ఐదుగురు సభ్యులు 2017-2022 మధ్య తమ వాణిజ్యాన్ని 56 శాతం పెంచుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. గతేడాది 422 బిలియన్ డాలర్ల విలువైన టర్నోవర్ సాధించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఐదుగురితో ఉన్న ఈ గ్రూపులోకి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAEలు చేరనున్నాయి. ఆగస్టులో జరిగిన BRICS సమ్మిట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదికాస్తా వచ్చే జనవరి నుంచి అమలు కానుంది. అయితే ఇలా విస్తరించిన సమూహం 2040 నాటికి ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
US, కెనడా, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు జపాన్‌లతో కూడిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) వాటాకు BRICS రెట్టింపు అవుతుందని అంచనాలు ఉన్నాయి. తమ జనాభా కొనుగోలు శక్తి పరంగా బ్రిక్స్ ఇప్పటికే G7 దేశాలను అధిగమించిందని రష్యా అధ్యక్షులు పుతిన్ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొన్నారు. ఇక గ్లోబల్ GDPలో G7 వాటా కేవలం 29.9 శాతం మాత్రమే కాగా బ్రిక్స్ షేర్ 31.5 నుంచి 37 శాతానికి పెరగనుంది.


Click it and Unblock the Notifications