US Charges on Adani: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్ట్ లంచం ఇవ్వటం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను మోసగించిన ఆరోపణలపై తాజాగా అమెరికాలో అభియోగాలు మోపబడ్డాయి.
ఈ క్రమంలో వ్యాపారవేత్త అదానీ వేలకోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది. లాభదాయకమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్లు లంచం ఇచ్చినందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురిపై న్యూయార్క్‌లోని యూఎస్ ప్రాసిక్యూటర్లు బుధవారం అభియోగాలు మోపారు. అలాగే ఈ ప్రాజెక్టుల కోసం సొమ్ము సేకరించేందుకు పెట్టుబడిదారులు, బ్యాంకులకు అబద్ధాలు చెప్పడం వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దీనిపై భారతదేశంలో కూడా చర్యలు మెుదలయ్యాయి. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ బుధవారం ఈ విషయంపై చర్యలు చేపడుతూ.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబేన్స్‌పై భారీ లంచానికి సంబంధించిన ఆరోపణలు మోపింది. అయితే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధం ఉన్నట్లు తేలింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) ద్వారా 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలుకు అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడించబడింది. ఆగస్టు-నవంబర్ 2021లో మూడుసార్లు SECI, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు వెల్లడైంది.
రూ.2 లక్షల కోట్లు ఆవిరి..
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లంచం విషయంలో పేర్కొనబడటంతో అదానీ గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్ల ప్రారంభంలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆవిరి అయింది. ఇదే క్రమంలో అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్న జీక్యూజీ పార్టనర్స్ షేర్లు సైతం ఏకంగా 21 శాతం మేర పడిపోయాయి. భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చిన కార్యక్రమంలో అదానీ నాయకత్వంతో పాటు కెడనాకు చెందిన సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఉన్నట్లు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ రానున్న 20 ఏళ్ల కాలంలో దాదాపు 2 బిలియన్ డాలర్లను సంపాదించే క్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులకు కోట్లలో లంచాలు ముట్టచెప్పినట్లు అమెరికా అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై పూర్తిస్థాయిలో తాము వివరణ ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించినప్పటికీ.. లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 10 నుంచి 20 శాతం వరకు పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రీ-ఓపెన్ ట్రేడ్‌లో 10 శాతం క్షీణించగా.. అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 7-18 మధ్య పతనాన్ని చూశాయి.


Click it and Unblock the Notifications