భగ్గుమన్న ముడి చమురు ధరలు.. ముందస్తు దాడుల వ్యూహాలతో మళ్లీ కొంపలు ముంచబోతున్న ఇరాన్..
Brent Crude Surges on Middle East Tension: మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధ మేఘాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై క్షిపణి దాడులు, రష్యా శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులకు తీవ్ర విఘాతం కలగడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్రంగా కుదుపునకు లోనయ్యాయి. శుక్రవారం నాటి అంతర్జాతీయ లండన్ ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మే నెల తర్వాత తొలిసారిగా బ్యారెల్కు $110 మార్కును దాటింది.
ముగింపు సమయానికి బ్రెంట్ ఫ్యూచర్స్ 3.7 శాతం పెరిగి బ్యారెల్కు $109.86 వద్ద స్థిరపడగా.. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 3.5 శాతం పెరిగి $101.41 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 21 తర్వాత డబ్ల్యూటీఐ 100 డాలర్లు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరాన్ ముందస్తు దాడులకు వ్యూహాలు రచిస్తోందన్న నివేదికలకు తోడు, ఎర్ర సముద్ర తీరంలోని అత్యంత కీలకమైన సౌదీ అరేబియా యాన్బు ఓడరేవును లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సౌదీ సంకీర్ణ దళాలు నాశనం చేయడంతో చమురు క్షేత్రాలపై భయాలు పెరిగాయి.

దీనికి తోడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నావికాదళ కార్యకలాపాలు పెరగడంతో గత పది రోజులుగా ఆ మార్గంలో ఓడల ప్రవాహం గణనీయంగా మందగించింది. మరోవైపు రష్యాలోని అతిపెద్ద ర్యాజాన్ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడి వల్ల అక్కడ చమురు శుద్ధి ప్రక్రియ నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా డీజిల్, ఇతర ఇంధన కొరత ఏర్పడింది. చమురు ధరల ధాటికి గ్లోబల్ మార్కెట్ కుప్పకూలకుండా చూసేందుకు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు అత్యవసర చర్యలు చేపట్టాయి.
అంతర్జాతీయ ఇంధన సంస్థ తన సభ్య దేశాల అత్యవసర నిల్వల నుండి ఏకంగా రెండు కోట్ల బ్యారెళ్లకు పైగా చమురును మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతించింది. అదే సమయంలో పెరిగిన ధరలను తగ్గించేందుకు యూఎస్ ఇంధన శాఖ తమ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ నుండి 1.7 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ను మార్పిడి చేసుకోవడానికి టెండర్లు జారీ చేసింది. అయినప్పటికీ, రష్యా-అమెరికాల మధ్య ఇంధన ఎగుమతులపై జరుగుతున్న చర్చలు కొలిక్కివస్తే తప్ప ఈ మార్కెట్ ఆందోళనలు పూర్తిగా వీడబోవని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 79 శాతం పెరగడం, ఒకే వారంలో డబ్ల్యూటీఐ 10.4 శాతం లాభపడటం భారతదేశం వంటి దిగుమతి ఆధారిత దేశాలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. భారత్ తన చమురు అవసరాలలో 85 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. బ్యారెల్ చమురు ధర ప్రతి పది డాలర్లు పెరిగితే భారత దిగుమతి బిల్లు భారీగా పెరిగి రూపాయి మారకపు విలువ క్షీణిస్తుంది.
రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి, వడ్డీ రేట్లను తగ్గించాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రణాళికలకు గండికొడుతుంది. మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన పరిష్కారం లభించి, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పునరుద్ధరణ జరిగితే తప్ప అంతర్జాతీయంగా సరుకుల రవాణా సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని షిప్పింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
