దూసుకెళ్తున్న చమురు ధరలు.. మళ్లీ కొంపలు ముంచబోతున్న హార్ముజ్ జలసంధి వార్..
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఈ వార్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరించడం.. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దాడులు ప్రతిదాడులు హెచ్చరిచడంతో ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తడంతో బుధవారం ట్రేడింగ్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 85 డాలర్ల మార్కును దాటి దూసుకెళ్లాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) రెండూ వరుసగా రెండో సెషన్‌లోనూ తమ లాభాల జోరును కొనసాగించాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.01 డాలర్లు (1.19%) పెరిగి 85.74 డాలర్ల వద్ద ముగియగా.. WTI క్రూడ్ బ్యారెల్‌కు 0.75 డాలర్లు (0.95%) వృద్ధి చెంది 80.09 డాలర్ల వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లోనే బ్రెంట్ క్రూడ్ ఏకంగా 9.6 శాతం పెరిగింది, ఇది మే 2020 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక ఒకేరోజు పతనంతో కూడిన పెరుగుదల కావడం గమనార్హం. గత నెల జూన్ 17న ఉభయ దేశాల మధ్య ఘర్షణలను ముగించేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలతో పాటు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకాయానాన్ని పూర్తిగా అడ్డుకోవాలని తీసుకున్న నిర్ణయం మార్కెట్లను మరింత వేడెక్కించింది. తాము ఇరాన్‌ను చాలా గట్టిగా దెబ్బతీస్తున్నామని.. వారి దాడి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ జలసంధిని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నామని ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో వ్యాఖ్యానించారు. దీనితో పాటుగా జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినందుకు గాను ఇతర దేశాల నుండి అమెరికా రుసుము వసూలు చేస్తుందని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ జలమార్గాల్లో అనియంత్రిత నౌకాయానానికి మద్దతు ఇచ్చే అమెరికా సుదీర్ఘకాల విదేశాంగ విధానం నుండి ఇది పూర్తిగా వైదొలగడాన్ని సూచిస్తోంది.
అమెరికా చర్యలకు ప్రతికారంగా ఇరాన్ కూడా గల్ఫ్ అంతటా క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. ఒమన్ ప్రాదేశిక జలాల పరిధిలోని హార్ముజ్ జలసంధి దక్షిణ మార్గం గుండా ప్రయాణిస్తున్న రెండు యూఏఈ చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ దారుణ దాడిలో ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు వరుసగా మూడవ రాత్రి కూడా దాడులు కొనసాగించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) వెల్లడించింది. ఈ దాడుల వల్ల ఇరాన్ బలగాలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా.. పౌరులపై, వాణిజ్య నౌకలపై దాడులు చేసే వారి సామర్థ్యం దెబ్బతింటుందని అమెరికా సైన్యం పేర్కొంది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలైన బందర్ అబ్బాస్‌లో ఏడు పేలుళ్లు.. కిష్ ద్వీపంలో మరో రెండు పేలుళ్లు సంభవించినట్లు పాక్షిక అధికారిక వార్తా సంస్థ YJC నివేదించింది.
హార్ముజ్ జలసంధిపై ఇరు దేశాలు నియంత్రణ ప్రకటించుకున్న సోమవారం నాటి పరిణామాలతో బ్రెంట్ క్రూడ్ 5 శాతం పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ.. గతంలో యుద్ధ సమయంలో నమోదైన గరిష్ట స్థాయి అయిన బ్యారెల్‌కు 120 డాలర్ల కంటే తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ సైనిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్రమైన ఒడిదుడుకులు, అస్థిరత తప్పవని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
