వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న చమురు మంటల సెగలు..పెట్రోల్,డీజిల్ ధరలపై బిగ్ సస్పెన్స్..
Brent Crude Surges Above $116: పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలు, వ్యూహాత్మక జలసంధులలో చమురు ట్యాంకర్లపై వరుస దాడిల పరంపర ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అదుపుతప్పి దాదాపు ఆరు నెలల గరిష్ట స్థాయికి దూసుకెళ్లాయి. సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల మధ్య ఇన్వెస్టర్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
శుక్రవారం నాటి ట్రేడింగ్ ముగింపు సమయానికి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $3.55 పెరిగి (3.14% వృద్ధితో) $116.72 వద్ద ముగిసింది. గతేడాది ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో ధరలు నమోదుకావడం ఇదే ప్రథమం. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర 3.8% ($3.80) బలపడి బ్యారెల్‌కు $103.27కు చేరుకుంది. ఈ వారంలో మొత్తం మీద బ్రెంట్ చమురు సుమారు 6% మేర ఎగబాకడం గమనార్హం.

సౌదీ అరేబియా సహా గల్ఫ్ జలాల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులను తీవ్రతరం చేయడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. సౌదీ రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ సంకీర్ణ దళాలు వెల్లడించాయి. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ధహ్రాన్‌లోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి రిమోట్‌గా పనిచేయాల్సిందిగా చమురు దిగ్గజం 'సౌదీ అరామ్కో' సిబ్బందిని ఆదేశించింది.
ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హోర్ముజ్, బాబ్-ఎల్-మండేబ్ జలసంధులలో వరుస నౌకా దాడులు, నౌకలపై మందుపాతరల పేలుళ్లు షిప్పింగ్ రంగంలో కలవరం సృష్టిస్తున్నాయి. ఇటీవల రెండు భారీ ఆయిల్ సూపర్‌ట్యాంకర్లు మందుపాతరలను ఢీకొనడంతో భారీగా చమురు లీకై సముద్ర తీర ప్రాంతాలు మూతపడినట్లు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
పెరుగుతున్న ఇంధన ధరలను కట్టడి చేసేందుకు అమెరికా తన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (SPR) నుంచి కొంత చమురును విడుదల చేయగా, జర్మనీ సహా జి-7 దేశాలు కూడా తమ జాతీయ నిల్వల నుంచి ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు టెండర్లు జారీ చేశాయి. అయితే, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, సముద్ర మార్గాల్లోని భద్రతా ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ చర్యల ప్రభావం నామమాత్రమేనని మార్కెట్ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
ఇరాన్‌తో త్వరలోనే వివాదం సర్దుమణుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో మార్కెట్లు దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరల ఈ నిరంతర పరుగులు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని మళ్లీ భగ్గున మంటలు పుట్టించేలా చేస్తాయని, ఇది సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల కోత అంచనాలను దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
