Bharat Petroleum: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఇంధన రంగంలో సేవలందిస్తోంది. దీని ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో మొగ్గు చూపినా తర్వాత వెనక్కి తగ్గింది. కాగా ఇప్పుడు కెపాసిటీని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇది కాస్తా కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరం కానుందని విశ్లేషణలు వినబడుతున్నాయి.
BPCLకు ఇప్పటికే ముంబై, కొచ్చి సహా మధ్యప్రదేశ్ లో రిఫైనరీలు ఉన్నాయి. కాగా తూర్పు లేదా పశ్చిమ తీర ప్రాంతా ల్లో కొత్తగా మరో భారీ రిఫైనరీని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. 50 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అనువైన స్థలం కోసం వెతుకుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రానికి వచ్చే మొదటి ప్రాజెక్టుగా ఇది మారే అవకాశం లేకపోలేదు.

దేశంలో పెరుగుతున్న ఇంధన వనరుల అవసరాన్ని తీర్చేందుకు ఈ భారీ రిఫైనరీ ఏర్పాటు చేయాలని BPCL నిర్ణయించింది. ఏకంగా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పాలని చూస్తోంది. 2029 నాటికి తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నుల కు పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ కృష్ణ కుమార్ ఇటీవల వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం. కానీ త్వరలోనే కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తుంది. సంస్థ చైర్మన్ గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో BPCL తన రిఫైనరీని APలో ఏర్పాటు చేసే విధంగా ఒప్పించగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్ర కల సాకారంలో కీలకపాత్ర పోషిస్తుందనే చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications