జీవితం చాలా బోరింగ్‌గా ఉంది.. ఉద్యోగం వదిలేస్తున్నా.. 22 ఏళ్ళ యువకుడి నిర్ణయంపై హాట్ డిబేట్ ఇదిగో..
కోరుకున్న దాని కోసం చాలా రకాల చర్చలు, అనేక రకాల ఆలోచనలు, డైలెమాల తర్వాత 22 ఏళ్ల బెంగళూరు యువకుడు ఆంషుల్ ఉతయ్య అనే యువకుడు తన ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్లుగా తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు లక్షలాది మందిని సరికొత్త ఆలోచన వైపు తీసుకువెళుతోంది. సాధారణంగానే ఉద్యోగం మానేస్తున్నాడన్న వార్త కన్నా.. నా పని నాకు బోరింగ్‌గా అనిపిస్తోంది, నేను నా సమయాన్ని వృథా చేస్తున్నానని అనిపిస్తోందని తాను ఈ వీడియోలో చెప్పిన విషయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంషుల్ ప్రస్తుతం Bengaluru లో ఫుల్ టైమ్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనకు ఆ పని అస్సలు ఇష్టం లేదని, ఈ పని తనను మానసికంగా అలసిపోయే స్థాయిలో బోరింగ్‌గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు, కొంత మంది స్నేహితులు, సహచరులు తన నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ, తాను తీసుకున్న నిర్ణయం పట్ల తనకు నమ్మకం ఉందని అన్నాడు. అదే సమయంలో, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని భయం కూడా ఉందని చెప్పుకొచ్చాడు.

కాగా ఆంషుల్ గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. అదే తనకు సంతోషాన్నిస్తోందని, ఆ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలనే తన కోరిక ఉద్యోగం వదిలే ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పాడు. నేను రేపు నా ఉద్యోగాన్ని వదిలిపెడుతున్నాను, తర్వాత ఏమి చేయబోతున్నానో నాకు తెలియదని వీడియోలో పేర్కొంటూ, ప్రస్తుతం తన జీవితం పట్ల అసంతృప్తిని స్పష్టంగా తెలిపాడు. ఆస్ట్రేలియాలోని రెండు యూనివర్సిటీలలో అడ్మిషన్ వచ్చినప్పటికీ, చదవాలనే ఆసక్తి తనకు లేదని అతను వెల్లడించాడు.నా జీవితంలో గందరగోళం ఎక్కువగా ఉంది. ప్లాన్ ఏది లేదు. ఏమి చేయాలో తెలియదే. కానీ ఇక్కడ ఉండి బాధపడడం కన్నా రిస్క్ తీసుకోవడం మంచిదని అనిపిస్తోందని వీడియోలో చెప్పాడు.
ఉద్యోగం వదిలే రోజు ఉదయం 7:45కి కూడా ఆంషుల్ చాలా టెన్షన్‌గా ఉండిపోయాడు.ఇప్పుడు వెనక్కి తగ్గాలనుకుంటే ఇంకా అవకాశం ఉంది, కానీ నా మనసు మాత్రం 'వెళ్లు, ఇది సరైన సమయం' అని చెబుతోందని అప్‌డేట్ వీడియోలో చెప్పాడు.తర్జనభర్జనల అనంతరం సాయంత్రం, ఉద్యోగానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత.. ఇప్పుడు వెనక్కి వెళ్లే వీలు లేదు, నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ ధైర్యంగా చెప్పాడు. అయితే మేనేజర్ మొదట అతనితో ప్రైవేట్‌గా మాట్లాడాలని కోరినట్లు, కానీ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని ఆంషుల్ పేర్కొన్నాడు.
ఈ వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది. అతని ఫాలోవర్లు 10 వేల నుండి 22.6 వేల వరకు ఒక్కరోజులో పెరిగారు. కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పలు విధాలు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఇది చూసి నాకు కొత్త ఆశ వచ్చిందని ఒకరు పేర్కొనగా.. నేను కూడా ఇదే చేయాలనిపిస్తోందని మరొకరు అన్నారు. నీ మేనేజర్ ఇప్పటికీ నీ రీల్ చూసి ఉంటాడని మరొక నెటిజన్ బదులివవ్వగా ఒక రోజు నేనూ కూడా ఇది చేస్తానని మరొక నెటిజన్ బదులిచ్చారు. ఏదేమైనా ఈ వీడియో Gen Z ఉద్యోగ కల్చర్ పై హాట్ డిబేట్ కు వేదికగా నిలిచింది.


Click it and Unblock the Notifications