Hrithik Roshan: నెలకు రూ.19 లక్షల అద్దె తీసుకుంటున్న హీరో హృతిక్ రోషన్..!
మనం ఇప్పుడు సంపాదించే ఆస్తులు భవిష్యత్తులో ఆదాయం ఇవ్వాలని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెబుతారు. ఇంటితోనే మరో ఇంటిని కొనుగోలు చేయవచ్చని వివరించారు. సంపాదించిన డబ్బును సరైనా మార్గంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయన సలహా నిజమనే అనిపిస్తుంది. చాలా మంది తాము సంపాదించిన ఆస్తులతో ఆదాయాన్ని పొందుతున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.
ఆయన సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. ఆయనకు బొంబాయిలోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతంలో తన ఆఫీస్ స్పేస్ ఉంది. ఈ ఆఫీస్ స్పేస్ ను భారీ అద్దెకు లీజుకు ఇచ్చారు. బొంబాయి అంధేరి వెస్ట్‌లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న లోటస్ నీలకమల్ బిజినెస్ పార్క్‌లోని తన వాణిజ్య ఆస్తిని 'క్లియర్ సింత్ ల్యాబ్స్ లిమిటెడ్'కు హృతిక్ లీజుకు ఇచ్చారని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ పేర్కొంది. ఈ ఆఫీస్ స్పేస్ విస్తీర్ణం దాదాపు 6,000 చదరపు అడుగులు (7 ప్రత్యేక పార్కింగ్ స్లాట్లతో కలిపి) ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 1, 2026-మార్చి 31, 2029 వరకు మొదటి మూడేళ్లకు నెలకు రూ.17 లక్షలు అద్దెగా నిర్ణయించారని తెలిపింది.

నాలుగో ఏడాది (ఏప్రిల్ 1, 2029) నుంచి 15 శాతం పెరుగుదలతో నెలకు రూ. 19.55 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించింది. ఈ లీజు గడువు మార్చి 31, 2031తో ముగుస్తుందని వెల్లడించింది. ఈ ఐదేళ్ల డీల్ కోసం అద్దెదారు రూ.68 లక్షల డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్ల లీజు ఒప్పందం ద్వారా హృతిక్ రోషన్‌కు రూ.10 కోట్లకు పైగానే నికర అద్దె ఆదాయం రానుంది. కేవలం క్యాపిటల్ వాల్యూ పెరగడమే కాకుండా నెలవారీగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య ఆస్తుల వైపు సెలబ్రిటీలు ఆకర్షితులవుతున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది.
హృతిక్ రోషన్ గత ఏడాది యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' (2025)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ఇటీవలే విడుదలైన 'ఆల్ఫా' (జులై 2026) చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications