Bloodbath on D Street: మార్కెట్ మహా పతనం, కారణాలివే
స్టాక్ మార్కెట్లు సోమవారం(నవంబర్ 22) భారీగా నష్టపోయాయి. అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ ఈ నెలలో మందకోడిగా ఉంది. గత కొద్ది రోజులుగా సూచీలు నష్టపోతున్నాయి. అయితే ఈ రోజు మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ ఓ సమయంలో ఏకంగా 1600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 17,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం కాస్త కోలుకున్నప్పటికీ అది కొద్దిగా మాత్రమే. మధ్యాహ్నం గం.3.15 సమయంలో సెన్సెక్స్ 1174 పాయింట్లు నష్టపోయి 58,461 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్లు క్షీణించి 17,412 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ ఈ వారం మరింతగా నష్టపోతే 17000-16800 స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

భారీగా నష్టపోయిన మార్కెట్లు
సోమవారం దలాల్ స్ట్రీట్ భారీగా పతనమైంది. వివిధ అంశాలు ప్రభావం చూపడంతో అన్ని రంగాలు కూడా నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ అత్యంత ఎక్కువగా క్షీణించింది. స్టాక్స్ వారీగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ భారీగా నష్టపోయాయి. టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, రిలయన్స్ ఉన్నాయి. లాభపడిన కొద్ది స్టాక్స్‌లో టాప్ 5 విషయానికి వస్తే భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సిప్లా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణాలు
దేశీయంగా ఫలితాల సీజన్ ముగిసింది. దీంతో మార్కెట్‌కు మద్దతు లభించలేదు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగియడం వంటి అంశాలు ఆసియా మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే దేశీయ, అంతర్జాతీయ ప్రభావాలతో మన మార్కెట్లు నష్టపోయాయి. ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం దెబ్బతీసింది. జర్మనీలో ఇప్పటిక లాక్ డౌన్ విధించారు. ఆస్ట్రియా సహా మరిన్ని దేశాలు కూడా కరోనా ఆంక్షల దిశలో పయనిస్తున్నాయి. యూకే, ఇటలీ, స్పెయిన్ దేశాలలో కేసులు పెరుగుతున్నాయి.

ద్రవ్యోల్భణ భయాలు
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలు నెలకొన్నాయి. మన దేశంలో రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్భణం పెరిగింది. నవంబర్ నెలలో ఎక్స్‌పైరీ ఉంటుంది. టెక్నికల్ అంశం పరిశీలిస్తే నిఫ్టీ సూచీ 50 రోజుల మూవింగ్ యావరేజ్ కిందకు వెళ్లింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఫార్మా రంగం బలహీనంగా ట్రేడ్ అవుతోంది. మరోవైపు రిలయన్స్-ఆరామ్‌కో మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ 4 శాతం పతనమైంది.