Blinkit Free Coriander: జొమాటో దేశంలో తన క్విక్ కామర్స్ సేవలను బ్లింకిట్ పేరుతో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో పనితీరు ఉత్తమంగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే కంపెనీ బ్రేకీవెన్ స్థాయికి చేరుకున్నట్లు తేలింది.
ఆన్‌లైన్‌లో కిరాణా, కూరగాయలు, పండ్లు తదితరాలను విక్రయించే బ్లింకిట్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీకి కూరగాయలతో పాటు కొత్తిమీరను ఉచితంగా అందించాలని ముంబైకి చెందిన బ్లింకిట్ వినియోగదారుని తల్లి సూచించింది. ఈ విషయాన్ని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండా ట్విట్టర్‌లో షేర్ చేశారు. చాలా మంది భారతీయులు కొత్తిమీర, పచ్చిమిర్చి కూరగాయల దుకాణాల నుంచి ఉచితంగా పొందడం అందరికీ తెలిసిందే. అయితే వాస్తవానికి ఆన్‌లైన్ కొనుగోలుదారులకు ఈ సౌకర్యం ఉండదు.

ముంబైకి చెందిన అంకిత్ సావంత్ అనే వ్యక్తి తాను బ్లింకిట్ నుంచి కూరగాయలు ఆర్డర్ చేసినప్పుడు కొత్తిమీరకు కూడా డబ్బులు చెల్లించటం తన తల్లి చూసి షాక్ అయ్యిందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. కొంత మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేస్తే కొత్తిమీర ఉచితంగా ఇవ్వాలని తన తల్లి సూచించినట్లు సదరు వ్యక్తి తెలిపారు. అయితే అతని పోస్ట్ ప్రస్తుతం కంపెనీ సీఈవో అల్బిందర్ ధిండాతో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన తర్వాత అల్బిందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అప్‌డేట్ పంచుకున్నారు. రానున్న కొన్ని వారాల్లో దీనిని మెరుగుపరుస్తామని అంకిత్ తల్లికి కృతజ్ఞతలు చెప్పారు. నిర్థిష్ట మెుత్తంలో కూరగాయల ఆర్డర్‌లపై 100 గ్రాముల ఉచిత కొత్తిమీరను జోడించే ఎంపికను బ్లింకిట్ అందుబాటులోకి తెచ్చింది. వెంటనే ఫీచర్ లైవ్ లోకి తీసుకురాబడింది.
అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే 6 లక్షల మంది దీనిని వీక్షించారు. చాలా మంది వినియోగదారులు ట్విట్టర్లో బ్లింకిట్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇది అక్షరాలా ప్రతి తల్లికి నచ్చే నిర్ణయమని ఒకరు కామెంట్ చేశారు. కంపెనీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయటం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications