2024 Budget announcements: వచ్చే నెలలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా.. ఆయా పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా మాత్రం కేంద్రంలో తమ గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఇప్పుడే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని భాజపా గట్టిగా విశ్వసిస్తోంది. దీంతో జూలైలో భారీ స్థాయి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని సైతం భావిస్తోంది. మరో ఐదేళ్లలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి, సంక్షేమంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ మేరకు నెట్‌వర్క్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే 25 ఏళ్ల కోసం ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోందని ప్రధాని తెలిపారు. భాజపా మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోందని వెల్లడించారు. దీనికితోడు జూలై బడ్జెట్‌లో పలు కొత్త ప్రకటనలు వినేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
సులభతర వ్యాపారం సహా నిబంధనలను నేరరహితంగా చేసేందుకు డీక్రిమినలైజేషన్ రూల్స్ తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దివాలా కోడ్ సవరణలు, ఆర్థిక కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు సమర్థవంతమైన పరిష్కారం, విదేశీ విద్యాలయాల క్యాంపస్‌లు భారత్‌లో ఏర్పాటు, బైజూస్ మరియు జీ పాలనా లోపాల దృష్ట్యా కంపెనీల చట్టం బలోపేతం, SEZల నుంచి కంపెనీల సులభతర నిష్క్రమణ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications