Onion News: ఉల్లి రైతులకు శుభవార్త.. ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి..
Onion Exports: కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి 99,150 మెట్రిక్ టన్నుల ఉల్లి ఎగుమతికి అనుమతించింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్, యూఏఈ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, శ్రీలంకలకు ఉల్లిని ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. దీనికి తోడు 2000 మెట్రిక్ టన్నుల తెల్ల ఉల్లి ఎగుమతికి కేంద్రం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం దేశం నుంచి అన్ని రకాల ఉల్లి ఎగుమతులు ప్రారంభమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వాభిమాని షెట్కార్ సంఘటన్ నాయకుడు రాజు శెట్టి స్పందించారు. ఉల్లి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనన్నారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ నుంచి తెల్ల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతించింది. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 99,150 మెట్రిక్ టన్నుల ఉల్లి ఎగుమతికి ప్రభుత్వం అనుమతిచ్చినా ఇది సరిపోదని రాజుశెట్టి అన్నారు.
గతంలో రైతు నాయకులు ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించటాన్ని తప్పుపట్టారు. రైతులకు ఆదాయ నష్టం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి లభించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు రావడంతో దేశవ్యాప్తంగా రైతులు ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించారు. మహారాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతు నాయకుడు అజిత్ నవాలే తెలిపారు.
ఈ ఏడాది బఫర్ స్టాక్ కోసం 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా ఉల్లి ధరలను నియంత్రించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అందువల్ల ఈ ఏడాది పెరుగుతున్న ఉల్లి ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉంటుందని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది.


Click it and Unblock the Notifications